రాజధానిపై రచ్చ: అధికార-ప్రతిపక్షాల మధ్య సవాళ్ళ పర్వం

tdp and janasena fires on ysrcp government about sand policy
Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి రాజధాని అమరావతిపై సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, గ్రాఫిక్స్ చూపించి నిర్మాణాలు చేపట్టలేదని వైసీపీ ఆరోపిస్తూ….నిర్మాణాన్ని ఆపేసింది. అలాగే వరదలు వస్తే అమరావతికి ముంపు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వాదిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి కావాలని, అందుకు తగ్గట్టుగానే రాజధాని ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

అటు టీడీపీ నేతలు అధికార పార్టీకి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.  తమతోపాటు వస్తే అమరావతిని చూపిస్తామనీ ఛాలెంజ్‌ చేస్తున్నారు. రాజధానిపై వైసీపీ వర్సెస్‌ టీడీపీ, జనసేన మధ్య సాగుతున్న పంచాయితీ ఇప్పుడు పీక్స్ కు వెళ్లిపోయింది. ఇప్పటికే అమరావతిపై పీటర్‌ కమిటీ నివేదిక, నిపుణుల ఏర్పాటుతో రాజధానిని తరలిస్తారనే అనుమానాల మధ్య ప్రతిపక్షం తన దాడిని పెంచింది. అమరావతిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ లేదనీ, దేశచిత్రపటంలో అమరావతికి చోటులేదంటూ మంత్రి  బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతల్లో కాక పెంచాయి.

ఈ సందర్భంలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌- వైసీపీ నేతలపై  సెటైర్లు వేశారు. రాజధానిని పులివెందులలో ఏర్పాటు చేసి, అక్కడికి దగ్గరలోనే ఉన్న కర్నూలులో హైకోర్టు నిర్మించాలని  పవన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే బుధవారం అమరావతికి టీడీపీ నేతలు బస్సుయాత్ర చేపట్టారు. బుధవారం కరకట్ట మీద మొదలైన టిడిపి రాజకీయం కోర్ కేపిటల్ ఏరియా సందర్శన దాకా కొనసాగింది. అమరావతిలో ఏమీ కట్టలేదని అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణకు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు.

16వేల అపార్ట్‌మెంట్లు 60 నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయని టీడీపీ వాదిస్తోంది. బొత్స తమతోపాటు కారులో వస్తే అన్నీ చూపిస్తామంటున్నారు. ఇటు అమరావతి రగడ నడుస్తుండగానే- కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై రాయలసీమ భగ్గుమంటోంది.

అటు కర్నూలులో న్యాయవాదులు పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మకు ఊరేగింపు చేశారు. రాయలసీమను కించపరిస్తే  పవన్‌ కల్యాణ్‌ను రాయలసీమలో తిరగనీయబోమని న్యాయవాది గోరంట్ల రామాంజనేయులు హెచ్చరించారు. ఇదిలాఉంటే తాజాగా బొత్స రాజధానిపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాజధానిని ప్రకటిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తోందని వివరిస్తోందని తెలిపిన బొత్స సత్యనారాయణ… నిపుణుల కమిటీ నుంచి నివేదిక వచ్చాక రాష్ట్ర రాజధానిపై ప్రకటన ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ.5,400 కోట్లు ఖర్చయిందని, 90 శాతం పనులు పూర్తయినట్టు ఎవరైనా చెప్పగలరా అని బొత్స సవాల్ విసిరారు. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు, ఐఏఎస్ అధికారుల భవనాలు మినహా మిగతావన్నీ తాత్కాలిక భవనాలేనని బొత్స పేర్కొన్నారు.

Leave a Reply