YSRCP Victory: జగన్ మాస్ విక్టరీకి ‘జబర్దస్త్’ రిజల్ట్.. ఆమె నూటికి ఎన్ని మార్కులేశారంటే!

Share Icons:
ముఖ్యమంత్రులు అన్ని రాష్టాలకు ఉంటారు.. కాని మనసున్న ముఖ్యమంత్రి మనకు మాత్రమే ఉన్నారంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా. వైయస్‌ఆర్‌ సీపీకి ప్రజలు అఖండమైన విజయాన్ని అందించి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. వైసీపీ అధినేత జగన్‌కు 175 స్థానాల్లో 151 సీట్లు ఇచ్చి అఖండ విజయాన్ని అందించారు ఏపీ ఓటర్లు. 50 శాతానికిపైగా ఓట్లు, 86 శాతం సీట్లుతో వైస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వైసీపీ ఏడాది పాలనపై రోజా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఈ ప్రజలు రాజన్న పాలన కావాలని జగన్‌ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించారు. జగనన్న వచ్చిన తరువాత నిజమైన రాజన్న పాలన మళ్లీ రావడం పట్ల చాలా సంతోషిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా జగన్ జనం పక్షాన నిలుస్తున్నారు. జగన్ గారి నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేయడం గర్వంగా ఉంది.

రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు ఏమైనా ఉద్దరిస్తాడనుకుంటే.. రాష్ట్రాన్ని మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశాడు. అభివృద్దికి ఆమడ దూరంలో పాలన చేసి రైతుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని అందర్నీ మోసం చేశాడు. కాని జగన్ గారు మేనిఫేస్టోలో ఏదైతే చెప్పేరో అది నూటికి నూరు శాతం చేస్తారు. ఆయన మాట ఇవ్వడానికి ఆలోచిస్తారేమో కాని.. మాట ఇస్తే మాత్రం కట్టుబడే ఉంటారు. అందుకే ఆయన కుటుంబం మాటతప్పని, మడమ తిప్పని కుటుంబంగానే ఉంది.

జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతం పూర్తి చేశారు. ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నా సరే.. చాలా బ్యాలెన్సింగ్‌గా పాలన అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు క్లియర్ చేసి.. వెయ్యి రూపాయిలు ఆసుపత్రి ఖర్చులు దాటితే దాన్ని ఆరోగ్య శ్రీ కిందికి తీసుకువచ్చారు. పేదవాళ్లకి వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ ఆర్ ఏవైతే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారో జగన్ గారు కూడా అంతే తరహాలో ముందుకు వెళ్తున్నారు.

జగన్ పాలనను తెలుగుదేశం వాళ్లు ఎన్ని విమర్శించినా.. ఆయన చిరునవ్వుతోనే సమాధానం ఇస్తూ పాలనతో చేసి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలకు ఉంటారు.. కాని మనసున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే ఉన్నారు. తాము వేసిన ఓటు పూర్తి న్యాయం జరిగిందని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన పాలనకు మార్కులు వేయాలంటే నూటికి నూరు వేస్తా’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు రోజా.