బాబు…పైపుల ద్వారా ఏసీ అని చెప్పి ఫుల్ కామెడీ చేశావుగా…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

హైదరాబాద్:  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ‘వచ్చే ఒలింపిక్స్ అమరావతిలోనేనని చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడా మొదలే కాని ‘హైపర్ లూప్’ రవాణా వ్యవస్థ సిద్ధమవుతోందని చిటికెలేశాడు. ఇంటింటికి పైపులైన్ల ద్వారా ఏసీ చల్లదనాన్ని సరఫరా చేస్తామని అసాధ్యమైన కామెడీ వదిలాడు. ఈ గిమ్మిక్కులన్నీ రియల్ ఎస్టేట్ ధరలు పెంచడం కోసం కాక మరేమిటి?’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు కేవలం ఆరు నెలల్లో సీఎం జగన్ పరిష్కారం చూపారని విజయసాయి రెడ్డి అన్నారు. అవినీతిలేని, పారదర్శక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పాలనలో అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని చెప్పారు. బలహీన వర్గాలు అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పన జరుగుతోందని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పాలించడం చేతకాకపోతే సలహాలు తీసుకోవాలని బాబు అన్నారు. ఓ వైపు భారీ ఎత్తున అప్పులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం… మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానంటూ తిరిగి తనపైనే ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపితే ఎలాగని ప్రశ్నించారు.

ఈ 6 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏదైనా సాధించిందంటే… అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గత 6 నెలల్లో రూ. 25 వేల కోట్లు అప్పులు చేశారని… అంటే నెలకు దాదాపుగా మూడున్నర వేల కోట్ల అప్పులు చేశారని… కానీ, ఒక్క అభివృద్ధి పనిని కూడా చేపట్టలేదని విమర్శించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 5 సార్లు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

 

Leave a Reply