జగన్‌కు మంచి పేరు వస్తుండటంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు…

Share Icons:

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. 14 నెలలపాటు పాకిస్థాన్ చెరలో ఉండి, సీఎం జగన్ చొరవతో ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అయితే, వారి సంతోషాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.

‘పాకిస్థాన్ చెరలో 14 నెలల పాటు నరకాన్ని అనుభవించిన మత్స్యకారులు సీఎం జగన్ గారి చొరవతో విడుదలయ్యారు. సొంత ఊళ్లకు చేరి సంబరాలు జరుపుకుంటుంటే చంద్రబాబునాయుడు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. సీఎం జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని దాడులు, అరాచకాలు మొదలు పెట్టారు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అటు విజయసాయి, జగన్ లపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు చేశారు. మూడు రాజధానులు బోగస్ అని…జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప మూడు రాజధానుల ప్రతిపాదనలో సరుకు ఎక్కడ ఉంది విజయసాయిరెడ్డి అంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్లో ప్రశ్నించారు.

అలాగే రైతుకి రుణ మాఫీ చెయ్యడం దండగని 2014లో జగన్ అన్నారని, 2019లో రూ.12,500 రైతు భరోసా అని దగా చేసారని  టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇచ్చే రూ.7,500 కూడా మూడు దశల్లో ఇస్తాం అంటున్నారని విమర్శించారు. అంతే కాదు రైతులు గోచి కట్టుకుని బురదలో నిలబడి నోరుమూసుకుని ఉండాలని…నోరెత్తితే తాట తీస్తాం అంటూ వైసీపీ నాయకులతో వార్నింగ్లు ఇప్పిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

అటు జేఏసీ యాత్రను అడ్డుకోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాజధాని గ్రామాల వారితో ప్రభుత్వం చర్చించాలని కోరారు. ప్రజల బాధను వినే అవకాశం ఇవ్వని జగన్.. సీఎంగా అనర్హుడు అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు.

 

Leave a Reply