ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందో అని బాబుకు భయం పట్టుకుంది…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఇక తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీలోకి పంపించిన ‘కోవర్టు’ను చంద్రబాబు నాయుడు ఇప్పుడు రంగంలోకి దించారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందో అని ఆయనకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ‘కోవర్టు’ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పించాడని, అబద్ధానికీ ఒక హద్దుండాలని ట్వీట్ చేశారు.

ఇక లులూ గ్రూప్ విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ… ‘లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని చంద్రబాబు ఉదారంగా కట్టబెట్టాడు. దీనికి ఎంత కమీషన్ ముట్టిందో త్వరలోనే బయటపడుతుంది. వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నాడు’ అని అన్నారు.

అయితే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. లూలూకు కేటాయించిన భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందని, త్వరలోనే అది బయటపడుతుందని మంగళవారం మాటలు ఎందుకు మాట్లాడుతారని విమర్శించారు. మీ అపర మేధావితనానికి తన జోహార్లని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన మీరు ఇలా మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. బైబై ఏపీ అన్న లూలూ సంస్థకు… తెలంగాణ వెల్ కమ్ అందని అన్నారు.

ఏపీలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెడతామని కంపెనీలు అంటున్నా మీకు సిగ్గు రావడం లేదా విజయసాయిరెడ్డిగారు? అంటూ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి మాల్ ను నగరం నడిబొడ్డున కాకుండా… మీ బొడ్డులో లేదా మీ ఇంటి దొడ్డిలో లేదా జనసంచారం లేని మీ జగన్ గారి ఇడుపులపాయ ఎస్టేట్ లో నిర్మిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను మీ సూట్ కేస్ కంపెనీలకు కారుచౌకగా మీ జగన్ గారు, మీరు అమ్మేస్తున్నారని విజయసాయిపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొత్త కేసుల్లో త్వరలోనే మీరు కోర్టు బోనులో నిలబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

 

Leave a Reply