బాబు…దుశ్శాసనుడు చింతమనేని ఆదర్శమా?

Share Icons:

అమరావతి: ప్రతిరోజు ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేసే  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఆయన తీరుని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమేనని ట్వీట్ చేశారు. ‘మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన దుశ్శాసనుడు చింతమనేని ప్రభాకర్‌ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలట. మీ బంధువైతే ఇంటికి పిలిచి మర్యాదలు చేయండి చంద్రబాబు నాయుడు గారూ. ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే. పోలీసులకు పచ్చ యూనిఫామ్ వేసిన చరిత్ర మీదే’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న వెంటనే స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.  ‘రౌడీ షీటర్లు, ఖూనికోర్లు, రేపిస్టులు 70 శాతం ఉన్న పార్టీ దేశంలో ఒక్క వైకాపా మాత్రమే అని సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టుల గురించి మర్చిపోయారా విజయసాయి రెడ్డి గారూ? జర్నలిస్టులను చచ్చే వరకూ కొట్టిన వైకాపా ఎమ్మెల్యేకి సన్మానాలు, ఎంపీడీఓ సరళగారిపై దాడి చేసిన ఎమ్మెల్యేకి రివార్డు ఇచ్చి వారి మార్గంలో నడవమని కార్యకర్తలకు హితబోధ చేసిన నీచ సంస్కృతి మీ జగన్ గారిది’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

‘పోలీసులను రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటున్న ముఖ్యమంత్రిగా జగన్ గారు చరిత్రలో నిలిచిపోయారు. ఇక పోలీస్ స్టేషన్లకు వైకాపా రంగులు, పోలీసులకు వైకాపా రంగులతో యూనిఫామ్ కుట్టిస్తారు అని ప్రచారం జరుగుతోంది. మీరే ధ్రువీకరించాలి విజయ్ గారు’ అని మరో ట్వీట్ లో విమర్శించారు.

కొడాలి నానిపై కేసు

గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతిలో బీజేపీ నేతలు కూడా ఇప్పటికే నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. వెంటనే కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో మంత్రి కొడాలి నానిపై వేమూరి ఆనంద సూర్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Leave a Reply