పవన్,చంద్రబాబులపై విజయసాయి విమర్శలు….బుద్దా వెంకన్న కౌంటర్…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: ఇక ఎప్పటిలానే ఈరోజు కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై విమర్శలు గుప్పించారు. ముందుగా పవన్ కల్యాణ్ గురించి చెబుతూ…. ‘‘నిత్య కల్యాణం’ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే… సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే’ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేసిన ఇసుక దీక్షపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ… ‘ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరవు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదు’ అని ట్వీట్ చేశారు.

మళ్ళీ వైసీపీ ఎంపీకి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఇసుక దీక్షకు జనాలు రాకపోతే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ‘నీతులు వల్లించిన జగన్ గారు సిగ్గు లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొంటున్నారు? బాబుగారి దీక్షకి జనాలు రాలేదు అని అంటున్నారు కదా? మరి మీ జగన్ గారు ఏంటి భయపడ్డారు?’ అని విమర్శించారు. ‘దేవుడి స్క్రిప్ట్ ఏమయ్యింది విజయసాయి రెడ్డి గారు? 23 మందే గెలిచారు అని ఎద్దేవా చేసిన మీ జగన్ గారు ఇప్పుడు ఎందుకు తడుపుకుంటున్నారు? టీడీపీ పేరు వింటే వణుకు పుడుతుందా? చంద్రబాబు గారిని చూసి నిద్రపట్టడం లేదా?’ అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో ప్రశ్నించారు.

కాగా, తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను గతంలో చంద్రబాబు లాక్కున్నారని, ఇప్పుడు అందుకే ఆయనకు 23 సీట్లే వచ్చాయని, అది దేవుడి స్క్రిప్ట్ అని జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

 

Leave a Reply