ఐదేళ్లకు సరిపడా ఇసుకను చంద్రబాబు మాఫియా స్మగ్లింగ్ చేసింది….

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: గత కొన్ని రోజులుగా ఇసుక కొరతపై ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాల ఆరోపణలని అధికార వైసీపీ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇసుక కొరత పేరుతో ‘ఇస్కో.. ఉస్కో’ అనడమే పరువు తక్కువ పని అని… దానికి చంద్రబాబు మద్దతు ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు.

పార్టనర్ ఖర్చుల కోసం ప్యాకేజీని సమకూర్చడం దగ్గర నుంచి పచ్చ మీడియాలో కవరేజి దాకా స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిర్మాణం అన్నీ మీరే కాదా? అని ప్రశ్నించారు. మళ్లీ సపోర్ట్ స్టేట్ మెంట్ ఎందుకో అని అడిగారు. మీ గురించి ఎవరికి తెలియదనుకుంటున్నారని అన్నారు. ఈ ఏడాది నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికి ఉండేది కాదని విజయసాయిరెడ్డి చెప్పారు.

మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను కూడా చంద్రబాబు మాఫియా స్మగ్లింగ్ చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా గోదావరి ఇసుకే కనిపించేదని అన్నారు. చేసిందంతా చేసి… వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పుడు పిల్లి శాపాలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చేశారు. ‘విజయసాయిరెడ్డిగారూ, ఇన్నాళ్లు మీరు ఢిల్లీలో తిప్పిన చక్రం వెనకున్న రహస్యాన్ని ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయామంటూ’ వ్యాఖ్యానించారు. ‘మీ వాడిని లోపల వేయించి సీఎం కుర్చీని కొట్టేయాలనే ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తున్నారుగా’ అంటూ ట్వీట్ చేశారు. 16 సంవత్సరాల శిక్షలో 16 నెలలు పోతే ఎంత విజయసాయిరెడ్డిగారూ… లెక్కల మాస్టారు కాబట్టి మీరే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. దీనికి తోడు సీబీఐ కోర్టు నుంచి విజయసాయి బయటకు వస్తున్న వీడియోను అప్ లోడ్ చేశారు.

ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైదరాబాదులోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. మినహాయింపు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బుద్దా వెంకన్న పై వ్యాఖ్యలు చేశారు.

 

Leave a Reply