బాబు దమ్ముంటే కుప్పం అసెంబ్లీకి రాజీనామా చేసి గెలవండి…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. నాలుగు నెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై విసుగొచ్చిందని, ప్రజలు ఇప్పుడు మళ్లీ తననే సీఎంగా కోరుకుంటున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు మళ్లీ తననే  కోరుకుంటున్నారట. ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు చంద్రబాబు గారూ. 13 జిల్లాల్లోని ఐదు కోట్ల మందిని ప్రజలు అని అంటారు. ముందు మీరు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవండి. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నారని భావిస్తారంతా’ అని ట్వీట్ చేశారు.

అలాగే ‘వంశ పారంపర్యం అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు జగన్ భరోసా కల్పించారు. గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నిటినీ పునర్నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు నెలల్లోనే జగన్ 80 శాతం హామీలను నెరవేర్చారు’ అని విజయ సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

అటు ఏపీ ప్రజలు పొరపాటు చేశారని, మొన్నటిసారి కూడా మళ్లీ చంద్రబాబును గెలిపించి ఉంటే బాగుండేదని కేంద్రమంత్రులు అభిప్రాయపడినట్టు టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తాను వారిని కలిసినప్పుడు వారిదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని మొత్తం ఒకే ప్రాంతంలో ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

ఇక టీడీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి 600 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. రాజధానిలో అనుసంధాన రహదారులకే రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం వెనకబడిపోతోందని, భవిష్యత్ ఉండాలంటే రాజధాని ఉండాల్సిందేనని జయదేవ్ స్పష్టం చేశారు. తమ హయాంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేశామని, విశాఖపట్టణం, కాకినాడ, అనంతపురం వంటి ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఖర్చు చేసినట్టు జయదేవ్ గుర్తు చేశారు.

 

Leave a Reply