టీడీపీ ప్రభుత్వం మాదిరిగా మేము ప్రతిపక్షం మైక్ కట్ చేయం: వైసీపీ

Share Icons:

అమరావతి:

 

రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అధికార, ప్రతిపక్ష నేతలతో బి‌ఏ‌సి సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిశాక వైసీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ… గతంలో బీఏసీ సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం లేదని అన్నారు. ఇప్పుడు బీఏసీ సమావేశం జరిగిన తీరు చూసి తామెంతో తప్పు చేశామని ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు పశ్చాత్తాపపడి ఉంటారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం ప్రతిపక్షం మైక్ కట్ చేయదని స్పష్టం చేశారు.

 

సభను హుందాగా నడుపుతామని, 23 అంశాలపై సభలో చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని భూ కేటాయింపులు, అగ్రిగోల్డ్, కేట్యాక్స్, ఇసుక అక్రమ రవాణా అంశాలపై చర్చిస్తామని అన్నారు. సభను అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని జగన్ స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు.

 

గతానికి భిన్నంగా అసెంబ్లీ నిర్వహిస్తామని, చరిత్ర తిరగరాసే బిల్లులను సభలో ప్రవేశపెడతామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 14 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు. ఈ నెల 12న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.

Leave a Reply