మూడు రాజధానులపై వెనక్కి తగ్గదు: జోలె పట్టుకుని బాబు నాటకాలు…

ysrcp mla ambati rambabu comments on chandrababu
Share Icons:

అమరావతి: తమ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై వెనక్కి తగ్గేది లేదని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతూ ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు.  గుంటూరు రోడ్డు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో  మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, పలువురు శాసన సభ్యులు, నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఆయన అభినందించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల ఆధారంగా సీఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేయనుందని తెలిపారు. హైకోర్టును కర్నూలులో, సెక్రటేరియట్ ను విశాఖలో, శాసనసభను అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారన్నారు.

రాజధానిలో కొంతభాగం విశాఖకు తరలిపోతే.. హైకోర్టు కర్నూలుకు తరలిపోతే.. ఆయనకు వచ్చే నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా ఉండేందుకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని, అయితే ఇది చంద్రబాబుకు నచ్చడం లేదని అన్నారు.

వారు చేస్తున్న ఉద్యమం అభివృద్ధికోసం చేస్తున్నది కాదంటూ.. ఆస్తుల అభివృద్ధికి చేస్తున్న ఉద్యమమే ఇది అన్నారు. అమరావతి పేర చంద్రబాబు జోలె పట్టి నాటకాలాడుతున్నారని ఆరోపించారు.

ఇక అమరావతి రైతులని ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అమరావతి రైతులకు నేను చేస్తున్న మనవి ఒక్కటే.. మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఎవరిమాట నమ్మకండి. మీ పొలాలకు నష్టం జరిగితే చెప్పండి.. నష్టం జరిగితే.. ప్రభుత్వం న్యాయంగా నిర్ణయంచేసి దానికి తగ్గ పరిహారం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది’ అని తెలిపారు. నిజమైన రైతులకు అన్యాయం జరుగదు. బినామీ రైతులకు అన్యాయం జరిగినా.. మీరు బాధపడవద్దు” అని చెప్పారు.

 

Leave a Reply