అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించిన చంద్రబాబుదే తుగ్లక్ పాలన: వైసీపీ

Share Icons:

విజయవాడ:

 

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…. రాజధాని పేరుతో చంద్రబాబు అంతర్జాతీయ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు ఆయన చేసిందేమీ లేదని, చంద్రబాబు అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారని ఎద్దేవా చేశారు. తుగ్లక్ పాలన అనగానే టక్కున చంద్రబాబు పరిపాలనే గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.

 

రాజధాని కోసం చంద్రబాబుతో రైతులు కలిసి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ విషయంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించారనీ, ఐదేళ్లలో ప్రచారం తప్ప చేసిన పనులేవీ లేవని దుయ్యబట్టారు. చంద్రబాబు తీరువల్లే ప్రపంచబ్యాంక్ రుణం వెనక్కి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు.

 

గత ఐదేళ్లలో చంద్రబాబు ఏపీలో తీవ్రమైన ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’కు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, లోకేశ్ ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

 

అటు చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. గోదావరి, కృష్ణా హారతులు షూటింగ్‌ల కోసమే ఏర్పాటుచేశారని విమర్శించారు. చంద్రబాబు తన అనుభవాన్నంతటినీ దోపిడీకి వినియోగించారని, ఆయన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్ అన్నారు. గోదావరి, కృష్ణా హారతులు శాస్త్రోక్తంగా జరిగేలా చూస్తామన్నారు. మసీదులు, చర్చిలు, ఆలయాలకు భద్రత కల్పిస్తామని తెలిపారు. దేవాలయ భూముల అన్యాక్రాంతంపై దృష్టి సారిస్తామని చెప్పారు. అదేవిధంగా దేవాలయాల్లో పాత కమిటీలన్నింటినీ రద్దు చేస్తామని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Leave a Reply