విశాఖ మేయర్ పీఠంలో హోరాహోరీ….మేయర్ పదవి కోసం వైసీపీలో ఫైట్….

ap adminstration shifted visakhapatnam soon
Share Icons:

విశాఖపట్నం: ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా గుర్తింపుపొందిన జీవీఎంసీ మేయర్‌ పీఠం దక్కించుకోవడాన్ని అధికార వైసీపీతోపాటు టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిపక్షంతో పోల్చితే అధికారం వైసీపీకి మరింత ప్రతిష్టాత్మకం అనడంలో అనుమానం లేదు. అధికారంలోకి వచ్చి ఇంకా పది నెలలు కూడా పూర్తికాకుండానే మేయర్‌ స్థానాన్ని కోల్పోతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపడం ఖాయం. అంతేకాకుండా విశాఖను పరిపాలనా రాజధానికి ప్రకటించినప్పటికీ అక్కడి ప్రజలు వైసీపీని తిరస్కరించారంటూ ప్రతిపక్షాలు దాడి చేయడం ప్రారంభిస్తాయి. వీటన్నింటి నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ చూస్తోంది.

ఇదిలా ఉంటే విశాఖ మేయర్ పీఠం రేసులో చాలామంది వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి తూర్పు నియోజకవర్గం టిక్కెట్‌ ఆశించి భంగపడిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ తాజా ఎన్నికల్లో మేయర్‌ పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కపోయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ నగర అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లి, గత ఎన్నికల ముందు తిరిగి పార్టీలో చేరిన దాడి రత్నాకర్‌ కూడా మేయర్‌ పదవిని ఆశిస్తున్నారు.

ఆయన తన భార్యను బరిలోకి దింపాలనే యోచనలో వున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అక్కరమాని విజయనిర్మల కూడా తమ కుటుంబంలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ పెద్దలను కోరినట్టు సమాచారం.

వీరే కాకుండా గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి మంగళవారం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌ కూడా మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసి వున్నందున తనకు మేయర్‌ పదవిపై హామీ ఇస్తే కార్పొరేటర్‌గా పోటీ చేస్తానని, లేనిపక్షంలో పార్టీ కోసం పనిచేస్తానే తప్ప పోటీకి దిగనని పేర్కొన్నట్టు సమాచారం. అదేవిధంగా గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్‌ శరగడం చినప్పలనాయుడు అనకాపల్లి ఎంపీ పదవిని ఆశించినప్పటికీ అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఇప్పుడు మేయర్‌ పదవిని కేటాయించాలని పార్టీ నేతల వద్ద కోరుతున్నారు. మేయర్‌ పదవిని ఆశిస్తున్నవారంతా కీలకమైన నేతలే కావడంతో  రెండున్నరేళ్లు చొప్పున ఇద్దరికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.

 

Leave a Reply