చంద్రబాబుపై సెటైర్లు: ఒకవైపు విజయసాయి మరోవైపు అంబటి

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి:

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులు సెటైర్లు వర్షం కురిపించారు. తాజాగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన విమర్శలని అంబటి రాంబాబు తిప్పికొట్టారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక.. మొదట ఐదు పథకాలకు సంతకాలు చేశారని.. కానీ ఐదేళ్ల పాలనలో వాటిని పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. రైతు రుణమాఫీ,ఎన్టీఆర్ సుజల స్రవంతి,ఫించన్లు,ఉద్యోగుల వయసు పెంపు వంటి హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అనేక బిల్లులు,చట్టాలు,పథకాలు తీసుకొచ్చామని చెప్పారు.

గతంలో బాబు వస్తే.. జాబు వస్తుందని ఒక్కరికీ ఉపాధి చూపించలేదని మండిపడ్డారు. కానీ జగన్ సీఎం అయ్యాక 4లక్షల మంది యువకులకు ఉపాధి కల్పించామన్నారు. ఇందులో 1,20,000 శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు ఓవర్‌యాక్షన్ కార్యక్రమాలు చేస్తూ.. ప్రజల మీద బలవంతంగా తన అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.మొన్నటికిమొన్న ఓ సినీ ఆర్టిస్టుతో వేషం వేయించి ప్రభుత్వంపై విషం కక్కించారని.. ఇప్పుడు గుంటూరులో శిబిరాన్ని ఏర్పాటు చేసి అందులో కొంతమందిని పెట్టి.. వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

అటు లోకేశ్ పైన విమర్శలు  గుప్పించారు. ఇటీవల గుంటూరు శరణార్థుల శిబిరాన్ని సందర్శించిన లోకేష్.. రాష్ట్రంలో రాజన్న పాలన కాదు.. రాక్షస పాలన అంటూ విమర్శించారని.. మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఆయనకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వచ్చమైన,నీతివంతమైన పాలన జరుగుతోందనే అక్కసుతోనే బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మంచి పనులు చేస్తే… ప్రజలు ఎందుకు ఓడిస్తారని అంబటి ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. సొంత పార్టీలోని నేతలనే చంద్రబాబు కాపాడుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని చెప్పారు

ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ లపై సెటైర్లు వేశారు. నెలకు రూ.5 వేల వేతనం అందుకునే గ్రామ వాలంటీర్లకు వివాహానికి పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎకసెక్కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్రయోజకుడు, అజ్ఞాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.

 

Leave a Reply