జన్మభూమి సభలతో ఒరిగేదేంటీ

Share Icons:

ఒంగోలు, జనవరి 5: 

జన్మభూమి సభలంటూ ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు ! ఈ సభలతో సగటు ప్రజలకు ఒరిగేదేమీ లేదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా ఉత్తుత్తి సభలెందుకు ?  కడుపు మండిన ప్రజలు నిలేస్తున్నారు ! వాళ్లకేం సమాధానం చెబుతారంటూ వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు.

రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఐదో డివిజన్లోని మహేంద్ర నగర్, గోపాల్నగర్లో బాలినేని పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే.. అది వైఎస్సార్ హయాంలోనేనని గుర్తు చేశారు. రూ.200 కోట్లతో రిమ్స్ ఏర్పాటు చేశాం. గుండ్లకమ్మపై ఉలిచి వద్ద చెక్ డ్యాం నిర్మించాం. రిజర్వాయర్ నుంచి రూరల్ గ్రామాలకు నీటి సరఫరా చేపట్టాం. ఒక్క నగరంలోనే రూ.19.5 కోట్లు వెచ్చించి ఓవర్ హెడ్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్లు, పైపులైన్లు వేసినట్లు బాలినేని తెలిపారు.

దామచర్ల ఎమ్మెల్యే అయ్యేనాటికి ఒంగోలు గ్రామంలా ఉందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన హయాంలోనే మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసిన సంగతి మరిచారా అని హితవు పలికారు. కార్పొరేషన్ అవడం వల్ల నిధుల లభ్యత పెరిగింది. ఆ నిధులతో ఉన్న రోడ్లు పగలగొట్టి కొత్త రోడ్లు వేస్తూ.. అదే గొప్ప అభివృద్ధిగా చెప్పుకోవడం టీడీపీకే చెల్లిందన్నారు. అభివృద్ధి పనుల్లో ఇష్టారాజ్యంగా కమీషన్లు దండుకొంటూ అధికారపార్టీ నేతలు ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని దుయ్యబట్టారు.

అందరికీ ఇళ్లు కార్యక్రమంలో కూడా కేంద్రం ఇచ్చిన నిధులను బొక్కేసే కార్యక్రమంగా మార్చారన్నారు. పొరుగు రాష్ట్రంలో చదరపు గజానికి వెయ్యి రూపాయలతో నిర్మిస్తుంటే ఇక్కడ రెండు వేలుగా నిర్ణయించడమేమిటని నిలదీశారు. నెలకు రెండు వేల చొప్పున ఇరవై ఏళ్ల పాటు పేదలు బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేరని చెప్పారు. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఇల్లు లేని పేదలందరికీ రూ.2 నుంచి రూ.5 లక్షలు వెచ్చించి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.

మామాట: ఏంటో ప్రభుత్వ కార్యక్రమాలు  పార్టీ ప్రచారానికి ఉపయోగపడుతున్నట్లున్నాయి…

Leave a Reply