దొనకొండపై వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Share Icons:

అమరావతి: ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండపై వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ఎయిర్‌ పోర్ట్‌తో సహా డిఫెన్స్‌ క్లస్టర్‌ తీసుకురావాలని దొనకొండను ప్రత్యేక సెజ్ గా అభివృద్ధి చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. దొనకొండలో గతంలో బ్రిటిష్ కాలంలో పెద్ద ఎయిర్ పోర్ట్ ఉండేది. ఆ తర్వాత కాలంలో అది కాస్త మూతపడింది. అతి పెద్ద రన్ వే తో ఉన్న దొనకొండ విమానాశ్రయాన్ని ఉడాన్‌ పథకంలో చేర్చి మళ్లీ వినియోగంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

మొత్తానికి రాజధానిగా మారుతుందని ప్రచారం జరిగిన దొనకొండ ప్రాంతంలో డిఫెన్స్ క్లస్టర్ తో పాటు విమానాశ్రయం ఏర్పాటు కానున్న నేపధ్యంలో అభివృద్ధి చెందుతుంది అని దొనకొండ వాసులు భావిస్తున్నారు. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పడినట్లైతే రక్షణరంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు, ఇతర ఏరో స్పేస్‌ పరిశ్రమలు అక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. దీంతో దొనకొండకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి వైసీపీ సర్కార్ హయాంలో దోనకొండకు మహర్దశ పట్టబోతుంది అన్న చర్చ జోరుగానే సాగుతుంది.

2014లో దొనకొండ విమానాశ్రయ ప్రాంతాన్ని కేంద్ర ఎయిర్‌ పోర్టు అథారిటీ బృందం పరిశీలించింది. హైదరాబాద్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల బృందం స్ధానిక అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దొనకొండ చేరుకొని పూర్తిస్ధాయిలో పరిశీలించి వెళ్లారు. దీంతోపాటు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ కూడా దొనకొండ విమానాశ్రయ స్థల సేకరణ, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఏడాదిన్నర క్రితం రన్‌వే ఏర్పాటు కోసం ఢిల్లీ ఏరోనాటికల్‌ సర్వే విభాగం వారం రోజులు పూర్తిస్థాయిలో సర్వే చేశారు. ఇక ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కార్ ను విజ్ఞప్తి చేస్తుంది.

ఇక డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంది. రక్షణ, విమానయాన రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు దొనకొండలోని విమానాశ్రయంలో ప్రత్యేక సెజ్‌ ఏర్పాటు చేయబోతున్నారు. దొనకొండ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ డిఫెన్స్ క్లస్టర్‌ పెట్టబోతున్నామంటూ లక్నోలో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో మంత్రి గౌతంరెడ్డి ప్రకటించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దొనకొండపై రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.

 

Leave a Reply