వార్ వన్‌సైడ్: లోకల్ పోరులో ఫ్యాన్ హవా….

Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సూపర్ విక్టరీ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ నామినేషన్స్‌లో వైసీపీ జోరు కొనసాగించింది. 652 జడ్పీటీసీ, 9696 ఎంపీటీసీ స్ధానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇందులో మెజారిటీ స్ధానాల్లో వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొన్ని స్ధానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్ధానాల్లో దాదాపు 50 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

టీడీపీ స్ధానిక ఎన్నికలకు వచ్చేసరికి చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. అధికార వైసీపీతో పోలిస్తే పలు జిల్లాల్లో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసే విషయంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. ప్రతీ జిల్లాలోనూ వైసీపీతో పోలిస్తే విపక్ష టీడీపీ నామినేషన్లు తక్కువగానే దాఖలయ్యాయి. అన్ని జిల్లాల్లో కలిపి వైసీపీ 23 వేలకు పైగా ఎంపీటీసీ స్ధానాల్లో నామినేషన్లు దాఖలు చేయగా.. టీడీపీ కేవలం 18 వేల స్ధానాల్లో మాత్రమే నామినేషన్ వేయగలిగింది. ఆయా స్ధానాల్లో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీతో పోరాటం చేసి ఒక స్ధానం మాత్రమే గెల్చుకున్న జనసేన పార్టీ ఈసారి స్ధానిక పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. మెజారిటీ జిల్లాల్లో జనసేన తరఫున నామినేషన్లు వేసేందుకు అభ్యర్ధులు సైతం లేని పరిస్ధితి. కాపు జనాభా అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం జనసేన పరిస్దితి దారుణంగానే ఉంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 641 ఎంపీటీసీ స్ధానాలకు జనసేన అభ్యర్ధులు నామినేషన్ వేశారు. అత్యల్పంగా కడప జిల్లాలో 24 మంది అభ్యర్ధులు మాత్రమే ఆ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.

తాజాగా ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో బీజేపీ తరఫున దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 1816 అంటే పరిస్ధితి ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర స్ధాయి నేతలు కూడా ఈ ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు తెలిసిపోతోంది.

Leave a Reply