విశాఖ ఎయిర్‌పోర్టు దగ్గర బాబుని అడ్డగించిన వైసీపీ శ్రేణులు…టీడీపీ నేతల ఫైర్

Modi,Against,Torch Display,ap,tdp,chandra babu
Share Icons:

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. మూడు రాజధానులని అడ్డుకుంటున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ మండిపడుతున్నాయి. అటు టీడీపీ శ్రేణులు కూడా అక్కడ భారీగా ఉండటంతో పోలీసులు ఏం చేయలేక చేతులెత్తేసారు. దీంతో బాబు కాన్వాయ్ విశాఖ ఎయిర్ పోర్ట్ వద్దే ఉండిపోయింది.

అయితే ప్రతిపక్ష నాయకుడికి స్వేచ్ఛను కల్పించాల్సిన ప్రభుత్వమే అడ్డుపడుతోందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని ప్రజల దగ్గరకు వెళ్లకుండా చేయటం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే అడ్డుకోమని చెప్పటం ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ అని పేర్కొన్నారు. అక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడకి వెళ్లి చూసే బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.

విశాఖలో తమ రౌడీయిజం ఏ స్థాయిలో ఉండబోతోందో వైసీపీ నేడు ప్రజలకు డెమో చూపించిoదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సినిమాకు ట్రైలర్ మాత్రమే ఇవాళ విశాఖ ప్రజలు చూశారన్నారు. విశాఖలో జగన్ పాలన ప్రారంభమైతే ఆ సినిమా ఇంకెలా ఉంటుందో గ్రహించాలన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖ ప్రజలకు విష సంస్కృతి ఎలా తెస్తామనేది వైసీపీ ఇవాళ చూపించిందని.. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని వర్ల రామయ్య పేర్కొన్నారు.

విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అడ్డుకున్నోళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులేనన్నారు. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి పోకుండా ఆంక్షలు పెట్టడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రాపకం కోసం మంత్రులే ఈ నీచానికి దిగజారారని విమర్శించారు. పోలీసు శాఖ వైసీపీ నేతల కనుసన్నల్లో నడవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. జనాలను తరలించి చంద్రబాబును అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

Leave a Reply