ఆటో డ్రైవర్ అవతారమెత్తిన సీఎం…డ్రైవర్లకు ఆర్ధిక సాయం….

YSR Vahana Mithra Scheme Launched Eligible Drivers Are Allowed To Apply Till October 30
Share Icons:

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది తన పాదయాత్రలో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు సాయం చేస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మాట నిలబెట్టుకోవడంలో భాగంగా జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే డ్రైవర్లకు రూ. 10 వేల సాయం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు వైఎస్సాడ్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నా’నంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా తాను అండగా ఉంటానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆటోవాలా చొక్కా వేసుకుని ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. ఏలూరులోనే ఈ హామీని ఇచ్చానని, ఇప్పుడు ఏలూరులోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు.

సొంత ఆటో, కారు ఉన్నవారికి ఏటా రూ. 10 వేల సాయాన్ని అందిస్తామని జగన్ చెప్పారు. ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్ధి పొందుతారని చెప్పారు. డ్రైవర్ల అకౌంట్లలోకి ఈ డబ్బును నేరుగా జమ చేస్తామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు.

అలాగే గాంధీ జయంతి రోజున దేశంలో కనీవినీ ఎరుగని విధంగా గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను ప్రారంభించామని… ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని తట్టుకోలేక, గాంధీ జయంతి రోజున మందు అమ్ముతున్నారంటూ చంద్రబాబు అభాండాలు వేశారని జగన్ అన్నారు. గాంధీ జయంతి రోజున ఎక్కడైనా మందు షాపు తెరిచి ఉందా? అని మీ అందరినీ అడుగుతున్నానని ప్రశ్నించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్టపగలే అబద్ధాలు మాట్లాడటం సబబేనా? అని అడుగుతున్నానని చెప్పారు. ఇలాంటి రాజకీయాలను చూసినప్పుడు మనసుకు బాధ కలుగుతుందని… కానీ, మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూసినప్పుడు సంతృప్తి వస్తుందని అన్నారు.

 

Leave a Reply