వచ్చే ఏడాది నుంచి వైస్సార్ చేయూత: 45 ఏళ్ళు దాటిన మహిళల…

ap cm ys jagan starts amma vodi scheme
Share Icons:

అమరావతి: అర్హులైన పేద మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థికసహాయం అందిస్తామని ఏపీ మంత్రులు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసిందని చెప్పారు. సాంకేతిక సమస్యలో లేక సమాచార లోపం వల్లనో ఎవరికైనా పెన్షన్‌ రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్‌ చేయూత పథకం అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

7 లక్షల పెన్షన్లు తొలగించామని ఆరోపిస్తున్న చంద్రబాబు దానిని నిరూపించగలరా..? అని బొత్స ప్రశ్నించారు. ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు మారడం లేదని అన్నారు. బాబు హయాంలో ఇచ్చిన పింఛన్ల కంటే 2 లక్షల పింఛన్లు అదనంగా ఇస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీదేనని రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో అర్హులు, అనర్హులు జాబితాలను పెట్టామని ఆయన వెల్లడించారు. రూ.15 వేల కోట్లు పెన్షన్లకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. చంద్రబాబు హయాంలో భర్త ఉన్న మహిళలకు కూడా వితంతు పెన్షన్ల ఇచ్చారని ఆరోపించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు కాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లేని సెలెక్ట్‌ కమిటీకి తాము పేర్లు పంపడం ఏంటని ప్రశ్నించారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలంటే సభ్యుల అభిప్రాయం తీసుకొని ఓటింగ్‌ పెట్టాలని.. అవేవి లేకుండా ప్రతిపక్ష పార్టీలు పేర్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజధాని అంశంపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని వెల్లడించింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. అందులో తమ జోక్యం ఉండదని పేర్కొంది.

 

Leave a Reply