ఎన్నికలకు సిద్ధంకండి…..

ys jagan prepare for ap elections
Share Icons:

విశాఖపట్నం, సెప్టెంబర్ 11:

విశాఖపట్నంలో మంగళవారం నాడు వైసీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు   వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఇతర నేతలు భేటీలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… మరో నాలుగైదు నెలల్లో, అంటే జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలు ఉన్నాయని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు జనవరి నాటికి సర్వం సిద్ధం కావాలని అన్నారు.

ఒకవైపు పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజకవర్గాలవారీగా, సెప్టెంబరు 17 నుంచి బూత్ల వారీగా కార్యక్రమాలు జరగాలని అన్నారు. ప్రతి నియోజకవర్గం సమన్వయకర్త ప్రతిరోజూ 2 బూత్లను గడపగడపకూ వెళ్లి సందర్శించాలని, వారంలో ఐదు రోజులపాటు ప్రతి బూత్లోని కుటుంబాలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు.

ఇక ఆయా బూత్ కమిటీతో సమీక్షచేసుకోవాలని, ఓటర్లుజాబితాల్లో చేర్పులు, సవరణలపై దృష్టిపెట్టాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున గడపగడపకూ వెళ్లడానికి మనకు సమయంలేదని, ఇదే ఆఖరి అవకాశమని ఆయన చెప్పారు.

మొదటి విడతలో పార్టీ నిర్దేశించిన మొదటి 50 బూత్ల సందర్శన, మొదటి నెలలో పూర్తిచేయాలని,  సమాంతరంగా నియోజకవర్గాల్లోని, మండలాల్లోని బూత్ మేనేజర్ల బూత్ కమిటీలపై దృష్టిపెట్టాలని అన్నారు. ఎక్కడ లోపాలున్నా వాటిని గుర్తించి వెంటనే సరిదిద్దాలని, ప్రతి 30–35 కుటుంబాలకు బూత్ కమిటీ సభ్యుడు వుండాలని, నవరత్నాలపై కుడా పార్టీ నాయకులతో వైయస్ జగన్ ప్రస్తావించారు.

నవరత్నాలు అనేవి ప్రజల్లో నమ్మకం కలిగించాయని, ప్రతి ఇంటికీ నవరత్నాలను చేర్చాలని, ఇది జరిగితేనే చంద్రబాబు ప్రలోభాలను అడ్డుకోగలమని తెలిపారు. నవరత్నాల ద్వారా ఒక కుటుంబానికి ఎంత మేలు చేకూరుతుందనే విషయాన్ని వివరించాలని, చంద్రబాబు ప్రలోభాల కన్నా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికీ ఎలాంటి మేలు జరుగుతుందనే అంశాన్ని వివరించాలని, నవరత్నాలు వివరిస్తూ రూపొందించిన పోస్టర్ను విడుదల చేశారు.

మామాట: మొత్తానికి ఎన్నికలకీ బాగానే ప్రిపేర్ అవుతున్నారు….

Leave a Reply