కొత్త సమీకరణాలకు దారి తీసిన జగన్

Share Icons:
విజయవాడ, డిసెంబర్ 31,
జగన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు. నూతన సమీకరణాలకు శ్రీకారం చుడుతున్నారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇప్పటి వరకూ బలహీన వర్గాలు ఎవరూ ఈ స్థానాన్ని దక్కించుకోలేదు. అది చరిత్ర చెప్పిన సత్యం. సుదీర్ఘకాలం ఒక బలమైన సామాజిక వర్గమే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని చేజిక్కించుకుంటుందన్నది కాదనలేని వాస్తవం.రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం చరిత్రను పరిశీలిస్తే 1952 నుంచి ప్రారంభమయిన ఈ ఎన్నికల్లో అన్ని సార్లూ అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులే ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తూ వస్తున్నారు. కావేటి మోహనరావు దగ్గర నుంచి చూసుకుంటే నల్లారెడ్డి నాయుడు, డీఎస్ రాజు, ఎస్.బి.పట్టాభిరామారావు, చుండ్రు శ్రీహరిరావు, జమున, కేవీఆర్ చౌదరి, చిట్టూరి రవీంద్ర, గిరిజాల వెంకటస్వామినాయుడు, ఎస్.బి.పి.బి.కె. సత్యనారాయణరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, మాగంటి మురళీ మోహన్ దగ్గర నుంచి ఇదే కన్పిస్తుంది.
తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంటు స్థానాన్ని1984, 1991, 2014లో గెలిచింది. భారతయీ జనతా పార్టీ కూడా ఇక్కడ విజయం సాధించడం విశేషం. మిగిలిన అన్ని సార్లూ దాదాపు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీయే ఈస్థానాన్ని కైవసం చేసుకుంది. 1952లో జరిగిన తొలి ఎన్నికలో మాత్రం కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు.ఇంత చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గంలో జగన్ పెద్ద సాహసానికి ఒడిగట్టారు. తొలిసారి బలహీన వర్గాలకు సీటు కేటాయిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే కలిగించింది. సిట్టింగ్ ఎంపీగా ఒకవైపు మాగంటి మురళీ మోహన్ ఉండటం, జనసేన ఎఫెక్ట్ కూడా జిల్లాలో బలంగా ఉంటుందన్న సంకేతాలు ఉన్నప్పటికీ జగన్ మాత్రం ఇక్కడ బీసీ అభ్యర్థిని ప్రకటించడం విస్తుకల్గిస్తోందంటున్నారు. అందునా రాజకీయాల్లో తొలిసారిగా అడుగుపెడుతున్న వ్యక్తినే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం నిజంగా సాహసోపేతమైన చర్యగా ఆ పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న మార్గాని భరత్ ను జగన్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మార్గాని భరత్ కు ఇప్పటి వరకూ ఎటువంటి రాజకీయ అనుభవంలేదు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఆర్థికంగా బలమైన కుటుంబం. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గౌడ సామాజికవర్గం బలంగా ఉంటుంది. మరో ప్రధాన సామాజికవర్గమైన శెట్టి బలిజలు కూడా వీరితో సఖ్యతగా ఉంటారు. దీనివల్లనే జగన్ భరత్ ను ఎంపిక చేశారంటున్నారు. మార్గాని భరత్ అప్పుడే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాజకీయాలకు కొత్త కావడం, పొలిటికల్ గా పెద్దగా పరిచయాలు లేకపోవడంతో భరత్ కు సమస్యగా మారింది. కొందరు పార్టీ నేతలే ఆయనకు సహకరించడం లేదంటున్నారు. కానీ ప్రస్తుత ఎంపీ మాగంటి మురళీ మోహన్ మీద ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న ధీమాతో భరత్ ఉన్నారు. మరి ఈ యువనేత జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా? లేదా? అన్నది చూడాలి.
మామాట:  పొటీలో నిలవాలంటే ధీటుగా రాటుతేలాలి కదా..

Leave a Reply