శృతి, మతీ లేని గతితప్పిన వీణ

Share Icons:

తిరుపతి, నవంబర్ 2,

కలిసి ఉంటే కలదు సుఖం, జట్టు కట్టడం వంటివన్నీ పాజిటివ్ దృక్పథానికి అవసరమైనవే కానీ, మరీ ఇట్టా గోడ దూకేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పునాదులు కాంగ్రెస్కు వ్యతిరేకం..  మరిపుడు కాంగ్రెస్ సిద్దాంతాలేమి మారిపోయాయి.. నిన్న, మొన్నటి వరకు తెలుగుదేశం వారు సోనియా గాంధీని, రాహుల్ ను ఆ పార్టీ విధానాలను తూర్పారాపడుతున్నవారే కదా.. రాత్రికి రాత్రి ఏమి మార్పు కలిగిందని కలిసి వీణ మీటుతున్నారో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు.

[pinpoll id=”64544″]

తెలుగుదేశం సారథి రెండు రోజుల వ్యవధిలోనే హస్తిన సందర్శించి, యువరాజును ప్రసన్నం చేసుకోవడానికి, శృతి చేసిన వీణ పలుకుతున్న రాగాలలో పలు అనుమానాల చరణాలున్నాయి. అటు తెలంగాణా ఎన్నికలు ముంచుకొస్తున్నాయనుకున్నా… దానివలన తెలుగుదేశానికి కొత్తగా వచ్చే నష్టం ఏమిటి? తెలంగాణలో పార్టీ నామమాత్రంగానే ఉంది. క్యాడర్ ఉంది నేతలు లేదనడం కూడా వ్యూహాత్మకమైనదే. ఎందుకంటే కేడర్ వద్దన్న పని లీడర్ చేయడు. లీడర్ వెళ్లిపోతే క్యాడర్ కూడా పోతుంది.. పనులు కావాలి కదా..?  తెలంగాణలో ఎలాగోలా 10-15 సీట్లు గెలవడం వలన ఇక్కడ ఏపీలో తెలుగుదేశానికి వచ్చే అదనపు లాభం ఏమీ ఉండదు.

మరి ఇన్ని తెలిసిన చంద్రబాబు, పార్టీ పునాదులకు ప్రమాదం కలిగే చర్య ఎందుకు తీసుకున్నట్టు? కాంగ్రెస్ పార్టీకి మరో ప్రాంతీయ పార్టీ మద్దతు ఇవ్వడం కొత్తగాదు.  ఆ పార్టీని సవాలు చేస్తూ జనించిన ప్రజారాజ్యం వంటి పార్టీలు గతంలో తిరిగి కాంగ్రెస్ లోనే కలిసిపోయిన చరిత్ర మనకు తెలుసు. రాజకీయ పార్టీలు మెర్జ్ కావడం, బయట నుంచో.. కూటమిగానో మద్దతు నివ్వడం రాజకీయాలలో ముఖ్యంగా ప్రస్తుత సంకీర్ణపాలనా సమయంలో తప్పనిసరి అవసరం అనుకున్నా.. తెలుగుదేశాధి నేత వక్కానిస్తున్నట్టు ప్రజాస్వామ్యం కొత్తగా ఏ ప్రమాదంలో పడింది? కాంగ్రెస్-టీడీపీ రాత్రికి రాత్రే శాలువాలు మార్చుకోవడం కంటే పెద్ద రాజకీయ దరిద్రం ఏముంది.?  బాగా స్ట్రాటజీలు వర్కవుట్ చేసే బాబు హడావుడిగా కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక ఉన్న కోణం ఏమిటన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

జగన్ పై విశాఖలో జరిగిన దాడి అనుకున్నంత తేలికైనది కాదా..? డీజీపీ వారు చెప్పినట్టు సంచలనం కోసం ఓ ఊరూ పేరూ లేని యువకుడు చేసిన దుస్సాహసం కాదా.? తీగలు లాగగలిగితే భారీ డొంకలు కదిలే అవకాశం ఉందా…? గోటితోనో.. లేక కోడి కత్తితోనో పోతుందనుకున్నది ఏకు మేకైందా..! ఏమైంది బాబూ..! చెప్పు బంగారూ…!! ఇంత అర్జంటుగా మీరు తాజా మాజీ భాగస్వామిని తెగనాడడానికి ఎదుకు ఉరకలెత్తుతున్నారు? రాజకీయంగానే అయినా, తెలుగు దేశం- కాంగ్రెస్ కలిసిన సమయం, సందర్భం అనుమానాస్పదంగా లేవూ… బాబు చాలా పెద్ద చేపకు దేనికో గాలం వేశారనిపించడం లేదూ.. సాధారణ రాజకీయ పండితులకు అంతుపట్టని వ్యూహాన్ని దేనినో ఆలపించడానికి చంద్రబాబు  కొత్త వీణలు కొంటున్నట్టున్నది. గమనిస్తున్నారా…  చంద్రబాబు తోటలో కోయిల ముందే కూస్తోంది.. ఇంతకీ కాంగ్రెస్-టీడీపీ కలయికను మీరు సమర్థిస్తారా… ?

మామాట:  వీణ వాయిస్తే ఓట్లు రాలుతాయా.. ఎలుకలూ… 

Leave a Reply