TRENDING NOW

ప్రేమపెళ్లిల్లు – దాడులు

ప్రేమపెళ్లిల్లు – దాడులు

మతం వ్యక్తిగతమైనది. మతం అంటే ఇష్టం… ఆ మతం అభిమతంగా ఉన్నంతవరకూ ఇబ్బందిలేదు. మతం దురభిమానంగా మారినపుడు మానవాళి విపరీత పరిణామాలను ఎదుర్కోక తప్పదు. భారతీయ జీవనంలో మతం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. గత కొన్ని శతాబ్ధాల పరాయి పాలన, 1947 తరువాత ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న ఆత్మవంచనాత్మక పరిపాలనా రీతులు ప్రజలను అనేక వర్గాలుగా, కులాలుగా, ప్రాంతాలవారీగా, భాషల వారీగా విభజించడంలో విజయవతమయ్యాయి.

 

 

ప్రజాస్వామ్యం ఓట్ల లెక్కల్లో ఉన్నంత కాలం న్యాయానికి విలువ ఉండదు. మంద బలానిదే రాజ్యాధికారం. అందువలన మన రాజకీయ నాయకులు ప్రజల్లో విజ్ఞత వికసించకుండా, వారు ఎల్లకాలం యాచకులుగా ఉండాలని, పాలకులు దయతలచి విదిలించే చితకానుకలను అందుకోవడానికి అర్రులు చాచాలనీ ఆశిస్తూ ఉంటారు.  ఈ నేపథ్యంలోనే మన దేశంలో కులరక్కసి వెర్రితలలు వేస్తోంది. విభజన రేఖ విస్తరిస్తోంది.  కులం రాజకీయంతో ముడుపడినంత కాలం ఈ విధానంలో మార్పు రాదు.

ఇటీవల మిర్యాలగూడలో, నిన్న హైదరాబాదులో జరిగిన హత్యాకాండ వలన మనం తెలుసుకోవలసింది నిందితులను శిక్షించడం కాదు. సమస్య మూలాలను గుర్తెరిగి దానిని సమూలంగా నాశనం చేయడం ఎట్లా అన్నది గ్రహించాలి. పరమత సహనం అని కొంత కాలం క్రితం చదువుకున్నాము కానీ, ఇపుడు పరమనిషి సహనం అలవరుచుకోవలసిన అవసరం వచ్చింది.  మనిషి మరో మనిషిని చూసి, అతనిని అంగీకరించే పరిస్థితి నేడు లేదు. అంతా అతని స్థితి మీదే ఆధారపడి ఉంటుంది. అధికారం, సంపద, కుల బలం ఉన్నవాడు వెలిగిపోతున్నాడు. అవి ఏవీ లేకుండా నీతి నిజాయితీలను నమ్మకున్నవానికి విలువలేకుండా పోతోంది. లేకపోతే కూతురు మరో కులం యువకుడిని వివాహం చేసుకుంటే రూ. 3 కోట్లు ఇచ్చి, వివాహాన్ని ర్దదు చేయాలని తండ్రి ప్రయత్నిస్తాడా, చివరకు రూ. కోటి ఖర్చైనా ఫరవాలేదు వాడిని చంపేయండని గూండాలను పురమాయిస్తాడా. ఇదేనా పరువు. ఇదెక్కడి పరువు. ఒక దారుణ జరిగి రెండు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే మరో దమనకాండ చోటుచేసుకుందంటే మనిషి విలువలకు ఎంతగా దిలోదకాలిచ్చాడో తెలియడం లేదూ, చట్టానికి, శిక్షలకు, సమాజానికీ భయపడే గుణం ఉన్నవారు ఇటువంటి దారుణాలకు.. అందునా కడుపున పుట్టిన బిడ్డలను సైతం చంపుకునే హృదయరహిత దమన నీతిని స్వాగతించే నిర్భీతి మనిషికి ఎక్కడనుంచీ వస్తోందో తెలుసుకోవాలి.

సమాజంలో శాంతి, సామరస్యం, సుహృద్బావనలు వెల్లివిరిసే చదువులు, వ్యక్తిగత శీల సంపదను పెంపొందించే వాతావరణం ఏర్పడాలి. పసితనంలోనే, పాఠశాల చదువులు కూడా పూర్తికాకుండా  ప్రేమపేరుతో పెద్దలను ఎదిరించే సంస్కారం అందిస్తున సమాజం మారకుండా తాజాగా జరుగుతున్న కుల హత్యలు, ఇగో దాడులు నివారించే వీలు లేదు.

మామాట :  మనిషి మారలేదు అతని మమత తీరలేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: