వైసీపీలోకి కరణం ఎంట్రీ: చీరాలలో కొత్త నాయకుడుని దించిన బాబు….

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి: టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వైసీపీలో తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఈయన ఒక్కసారిగా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతో టీడీపీ అధిష్టానం షాక్‌కు గురైంది. అయితే ఆ షాక్ నుంచి తేరుకొని, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టారు. ఆ వెంటనే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కూడా నియమించేశారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ ఇంచార్జ్‌గా యడం బాలాజీని నియమించడం జరిగింది. ఈ మేరకు ఓ ప్రకటనను టీడీపీ మీడియా కమిటీ కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు విడుదల చేశారు. ‘టీడీపీ జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారం చీరాల నియోజకవర్గ ఇంచార్జ్‌గా యడం బాలాజీని నియమించడం జరిగిందని.. రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కరణం వెల్లడించారు. వైసీపీ అనుకూల పవనాలు వీచినా నియోజకవర్గ ప్రజలు తనను 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్ దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ను కలిసేందుకు చీరాల నుంచి తాడేపల్లికి ఆయన బయలుదేరారు. కరణం వెంట ఆయన సన్నిహితులు, మద్దతుదారులు కూడా వైసీపీలోకి వెళ్లనున్నారు.

గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని తన సన్నిహితులు, మద్దతుదారులతో సమాలోచనల తర్వాత  వైసీపీ గూటికి చేరాలని కరణం బలరాం నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఇప్పటికే వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఇప్పుడు కరణం బలరాం కూడా వైసీపీ గూటికి చేరనుండటం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కరణం బలరాంను వైసీపీ గూటికి తీసుకురావడంతో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీని డిఫెన్స్‌లోకి నెట్టేందుకు ముందుగానే కరణం బలరాంను వైసీపీ గూటికి చేరేలా బాలినేని ఒప్పించారు.

Leave a Reply