వరల్డ్ కప్: పాక్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించిన భారత్

Share Icons:
మాంచెస్టర్,17 జూన్ :

వరల్డ్ కప్‌లో యుద్ధంలా సాగిన మ్యాచ్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని మట్టికరిపించింది. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) పరుగులతో పాకిస్థాన్‌పై భారీ విజయం సాధించింది. తొలుత హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ (113 బంతుల్లో 140; 14ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బంతుల్లో 77, 7 ఫోర్లు), రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 336/5 భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో శంకర్ (2/22), హార్దిక్ (2/40), కుల్దీప్ యాదవ్ (2/32) ధాటికి పాక్ 40 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులకు పరిమితమైంది.

ఇక మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు అనేక రికార్డులు నెలగొల్పారు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 358 సిక్సర్లు కొట్టిన రోహిత్.. ధోనీ(355)ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరాడు.

అలాగే భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో ద్రవిడ్ (340)ను వెనక్కి నెట్టి ధోనీ (341 ) రెండో స్థానానికి చేరాడు. సచిన్ (463 ) టాప్‌లో ఉన్నాడు.
ప్రపంచకప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన మూడో బౌలర్‌గా విజయ్ శంకర్ నిలిచాడు.

విశ్వ సమరంలో పాక్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్(140)  నిలిచాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2015లో విరాట్ కోహ్లీ (107) దాయాదిపై తొలిసెంచరీ నమోదు చేశాడు.

ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. 336/5 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2015లో చేసిన 300/7 ఇప్పటి వరకు అత్యధికం.

136 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. సచిన్ – సిద్ధు 90 పరుగుల (1996లో) రికార్డు తెరమరుగైంది. ఓవరాల్‌గా పాక్‌పై విశ్వకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్.

Leave a Reply