వరల్డ్ కప్ సెమీస్: టీమిండియాని కివీస్ నిలువరించగలదా…?

world cup first semis india vs new zealand
Share Icons:

లండన్:

 

మరో వారం రోజుల్లో ముగియనున్న ప్రపంచ కప్ కీలక అంకానికి నేడు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోని టీమ్‌ఇండియా.. నాలుగో స్థానంతో లీగ్ దశను ముగించిన న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరుగనుంది. ఇక భీకర ఫామ్ లో ఉన్న భారత్ టాపార్డర్‌కు.. బంతులతో మాయ చేసే కివీస్ పేస్ అటాక్‌కు మధ్య సమరంగా భావిస్తున్న రసవత్తర పోరుకు ఓల్డ్ ట్రఫోర్డ్ వేదిక కానుంది.

 

అయితే వరుస శతకాలతో మోత మోగిస్తున్న హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీని నిలువరిస్తే చాలని కివీస్ భావిస్తుంది. కానీ కివీస్ బౌలర్లని చితక్కొట్టి టీమిండియాని ఫైనల్ చేరవేస్తామని టాప్ ఆర్డర్ ధీమాతో ఉంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ మొత్తం తొలి మూడు స్థానాల చుట్టే తిరుగుతున్నది. రోహిత్, రాహుల్, కోహ్లీలకు పంత్, పాండ్యా, ధోనీల హిట్టింగ్ తోడు అయితే టీమిండియా విజయం అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు.

 

అటు బుమ్రాకు తోడుగా షమీ ని తీసుకుంటారా లేక భువిని తుది జట్టులోకి తీసుకుంటారా అనేది చూడాలి. అయితే ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో వెళ్తారా లేక.. ఒకర్ని తప్పించి ఆ స్థానంలో జడేజా, లేదా అదనపు పేసర్‌కు చాన్స్ ఇస్తారా అనే అంశంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.

 

న్యూజిలాండ్ పేసర్లు ఫెర్గూసన్ (17), బౌల్ట్ (15), హెన్రీ (10) కలిసి ఈ టోర్నీలో తీసిన వికెట్లు 42. బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపులు లేకున్నా కివీస్ సెమీస్ వరకు చేరడంలో వీరి పాత్ర చాలా ఉంది. ఈ ముగ్గురితో పాటు నీషమ్ (11), గ్రాండ్‌హోమ్ (5) కూడా ఓ చేయి వేస్తే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. అటు కివీస్ బ్యాటింగ్ లో కెప్టెన్ కెన్ విలియం సన్ మీదే ఆధార పడి ఉంది.

 

పిచ్, వాతావరణం

 

గత కొన్ని మ్యాచ్‌లుగా ఓల్డ్ ట్రఫోర్డ్ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తున్నది. వికెట్ బ్యాటింగ్‌తో పాటు పేస్‌కు అనుకూలం. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది.

 

తుది జట్లు (అంచనా)

 

భారత్: రాహుల్, రోహిత్, కోహ్లీ (కెప్టెన్), పంత్, ధోనీ, పాండ్యా, కార్తీక్/జాదవ్, భువనేశ్వర్/షమీ, కుల్దీప్, చహల్, బుమ్రా.

 

న్యూజిలాండ్: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్ట్.

Leave a Reply