ఏడు దశాబ్దాలవుతున్నా ఎదగని మహిళ 

Share Icons:

ఏడు దశాబ్దాలవుతున్నా ఎదగని మహిళ 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా నేటికీ మహిళకు స్వేచ్ఛలేదు. ఎత్తు ఎదగలేదు. మహిళకు పట్టం అంటూ  బింకాలు పలకడం మినహా నిజానికి ఒరిగిందేమీలదు. మహిళలపట్ల అనాదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. వారికి రావల్సిన భాగస్వామ్యం ఇవ్వటానికి  తాత్సారం చేస్తూనే వున్నారు. వారికీ పదవులు వచ్చినా బ్యాక్ డ్రైవింగ్ కే పరితమయ్యారు. వారు సమర్దులే ఏ పనినయిన నిర్వహించ గల సామర్ధ్యం మహిళలకు వుంది. సమాజ సంకుచిత భావాలే వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.

శ్రీ చిలకమర్తి వారు ప్రసన్న యాదవ నాటకం లో చెప్పిన పద్యం హృద్యం

“ముదితల్ నేర్వరగా రాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ ”

ఆంటే ఆడ వాళ్ళు పురుషుల లాగా చక్కగా చదవగలరు, శత్రువుల్ని చీల్చి చెండాడ గలరు, ప్రపంచాన్ని పరిపాలించ తగిన సామర్ధ్య వున్న వాళ్ళు. ప్రోత్సహిస్తే మహిళలు చేయలేని పని ఏది లేదు. స్త్రీ పురుష సమానత్వం గురించి ఇంకా మాట్లాడు కుఉంటున్నామంటే మనం ఇంకా ఏ దశలో ఉన్నామో ఆలోచించాలి. జీవన సమరం ఆటు పోటు ఇంకా ఎదుర్కొంటోంది. బతుకు బండి యీడ్వటం కష్టం గానే వుంది. సమాజం ఇంకా చిన్న చూపే చూస్తోంది అన్నిటికి ఆడది కావాలి కానీ ఆమెకు గౌరవం ఇవ్వటంలో వెనకబడి వున్నాం. చదువుల్లో ముందున్నారు, అన్ని పోటీల్లో నెగ్గుకొస్తున్నారు క్రీడల్లో కీర్తి తెస్తున్నారు అత్యున్నత పదవి కూడా పొందుతున్నారు. కానీ ఇంకా అభద్రతా భావంలో వుండటం శోచనీయం. వేధింపు లెక్కువయ్యాయి. వేదనలు పెరిగాయి, చట్టాలంటే భయం లేదు. చట్ట సభల్లో వాణి వినిపించుకోరు. గ్రామీణ స్త్రీలు ఉన్నత విద్యలో దూసుకు పోవాలి. వారికి ఇచ్చిన సౌకర్యాలను వినియోగించు కోవాలి ఉపాధి విద్యలలో రాణించాలి. స్వయం ఉపాధి పధకాలను సార్ధకం చేసుకోవాలి.

వికృతమయిన పోకడలున్న సమాజం మనది. దారి తప్పటానికి అవకాశాలెక్కువ సంయమనం వహిస్తూ వివేకంతో ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి పాకుడు రాళ్ళ మీద నడవ కూడదు. ఈనాటి సమాజంలో మహిళా ఉనికి కాపాడు కోవాలంటే ఆత్మ స్థైర్యం, ధైర్యం తప్పని సరి. సాహసం లేక పోతే అడుగు ముందుకు వేయలేరు. సేవా భావం వారికి పుట్టుక తోనే వుంటుంది దాన్ని మరింత సార్ధకం చేసుకోవాలి సమస్యలను చూసి బెదిరి పోకుండా పోరాటడి విజయం సాధించాలి. మహిళ వంటింటికి మాత్రమే పరిమితం కాకూడదు. అదేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ విలువల దేశాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. తెలుగులో మాట్లాడి, పిల్లలకు తెలుగు నేర్పించాలి. తల్లి మొదటి గురువు అనే విషయం అన్నది మర్చిపోకూడదు. సంఘటిత మహిళా శక్తి దేనినయినా సాధిస్తుందని తెలుసుకోవాలి. తను విద్యనేర్చి తన కుటుంబానికి విద్య నందించాలి. విద్య లేని తల్లి ఇవాల్టి సమాజంలో నిలదొక్కుకోవటం కష్టం. మహిళ ఆంటే శ్రమైక జీవన సౌందర్యం. ఆత్మా విశ్వాసమే మహిళకు పెట్టని ఆభరణం. అందుకే  వో మహిళా మేలుకో, ఏలుకో తల ఎత్తుకొని జీవించు తలపొగరు వాళ్ళ తలలు వంచు. రుద్రమదేవి, ఝాన్సీరాణి, శారదా మాత,  దుర్గాబాయి స్ఫూర్తి ప్రదాతలు. వందనం అభివందనం అభినందన చందనం.

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత) అని ఆర్యోక్తి. సృష్టికి మూలం స్త్రీ. దేవుడికి ప్రతిరూపం తల్లి. అలాంటి తల్లి తల్లడిల్లి కన్నీరు కారిస్తే అది మనకు మంచిదా? కాదు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి ప్రతి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను నిర్వహిస్తోంది. ఈ వేడుకను ఐరాస గత వంద సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.  “మహిళలకు సమానత్వమే మనకు ప్రగతి’’ అనే థీమ్ తో వేడుకలు నిర్వహిస్తుంది. ఈ రోజున ఆయా రంగాల్లో ప్రముఖ మహిళలు సాధించిన ప్రగతిని స్పూర్తిగా తీసుకొని ముందుగా సాగేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింస, వేధింపులు చూస్తుంటే మనం పూర్తిగా తిరోగమిస్తున్నామనిపిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ మాతృమూర్తిని వేధించి మనం పావుకున్నదేమిటి?  వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలురంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మహిళా సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు తలెత్తినా, ఎందరో నినదించినా ఫలితం లేకుండా పోయంది. మహిళల చదువు ఏ సమాజానికైనా వెలుగునిస్తుంది. వారిలో చైతన్యం ప్రపంచాన్ని నడిపిస్తుంది. మహిళల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం రావాలి. ఆయా రంగాల్లో రాణించిన, రాణిస్తున్న వారిని స్పూర్తిగా తీసుకోవాలి. వీరికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరునిది.

సమానత్వం సాధించాలంటే మహిళలు కదం తొక్కి ముందుకు కదలాలి. వేళ్లూనుకున్న వివక్షా పూరిత భావజాలాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. తమ హక్కుల కోసం పోరాడాలి. మేము మానవులనమే అని, మాకు హక్కులుంటాయని వెలుగెత్తి చాటాలి.వివేకానందుడు చెప్పినట్టు ఏ పక్షి ఒక రెక్కతో ఎగరలేదు. స్త్రీ సమానత్వం సాధిస్తే తప్ప మన సమాజం అభివృద్ది చెందదు.

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply