రోహిత్ తో ఓపెనింగ్ కి వచ్చేదెవరో?

Will Rohit Sharma solve India's Test opening conundrum
Share Icons:

ముంబై: టీమిండియా టెస్ట్ జట్టులో మాజీ ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్ రాణించిన విధంగా తర్వాత ఏ ఓపెనర్లు రాణించలేదు. వారు రిటైర్డ్ అయిపోయాక ఆ స్థాయిలో ప్రదర్శన చేసే ఓపెనర్లు టీమిండియాకి దొరకలేదు. వరుసగా లోకేశ్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధవన్, పార్థివ్ పటేల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి లాంటి ఆటగాళ్లు ఓపెనింగ్ కి వచ్చిన ఎవరు పెద్దగా క్లిక్ అవలేదు. వరుస వైఫల్యాల కారణంగా విజయ్, ధవన్ టెస్టు కెరీర్‌కు పడితే..కీపర్లు ఎక్కువైపోవడంతో పార్థివ్ స్థానానికి ఎసరు వచ్చింది.

అటు యువ సంచలనం పృథ్వీ షా ముందు గాయం, ఆ తర్వాత నిషేధం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే షా ఆడిన కొన్ని మ్యాచ్ లో అద్భుతంగానే ఆడాడు. స్వతహాగా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అయిన విహారి తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. ఇక ఎటొచ్చి మిగిలింది. మయాంక్, రాహుల్. ఇందులో మయాంక్ కాస్తో కూస్తో నిలకడగా ఆడుతుంటే.. రాహుల్ మాత్రం పూర్తిగా నిరాశ పరిచాడు. రాహుల్ కి బోలెడు అవకాశాలు వచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై జట్టులో చోటుకు ఎసరు తెచ్చుకున్నాడు.

దీంతో పరిమిత ఓవర్ల మ్యాచ్ ల్లో దుమ్ము దులిపేస్తున్న రోహిత్ శర్మకు తొలిసారి ఓపెనర్ గా అవకాశం వచ్చింది. అయితే అంతకముందు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ ఆడాడు. 2013లో రోహిత్‌కు తొలి టెస్టు ఆడే చాన్స్ దక్కింది. ఆరంభంలో ఎక్కువ అవకాశాలు లభించకపోవడంతో రోహిత్ పెద్దగా వెలుగులోకి రాలేదు. మిడిలార్డర్‌లో వచ్చిన ఒకటీ రెండు అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కూడా అతడికి ప్రతిబంధకంగా మారింది. అయితే వస్తూ పోతూ సాగిన టెస్టు కెరీర్‌లో రోహిత్ 27 టెస్టుల్లో (47 ఇన్నింగ్స్‌లు) 39.62 సగటుతో 1585 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.

తాజాగా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లినా.. ఆరోస్థానంలో విహారి కోసం బెంచ్‌కే పరిమితమయ్యాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం గురువారం జట్టు ఎంపికకు ముందే రాహుల్‌పై వేటు వేసి రోహిత్ ని జట్టులోకి తీసుకున్నారు. అటు రోహిత్ తో ఎవరు ఓపెనింగ్ కి వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిలకడ కనబరుస్తున్న యంగ్‌తరంగ్ శుభ్‌మన్ గిల్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చినా.. తుది జట్టులో ఉండే అవకాశాలు మాత్రం పెద్దగా కనిపించడం లేవు. మయాంక్ అగర్వాల్‌తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేసే చాన్సే ఎక్కువ. మరి చూడాలి ఈ ఓపెనింగ్ పెయిర్ దక్షిణాఫ్రికా సిరీస్ లో ఏ మేర రాణిస్తారో.

Leave a Reply