వడమాల ఎందుకు స్వామీ!

వడమాల ఎందుకు స్వామీ!
Views:
17

తిరుపతి, ఆగష్టు 10,

రామభక్తుడయిన ఆంజనేయస్వామికి  భక్తులు వివిధ రకాల పూజలు, అభిషేకాలు నిర్వహిస్తు ఉంటారు. సాధారణంగా హనుమకు తమలపాకు మాల, వడ మాల వేస్తామని మొక్కుకునే భక్తులూ ఎక్కువే. మరి దీనివెనుకనున్న రహస్యం ఏమిటో పరమాచార్యులు ఓ భక్తునికి వివరించారట… సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్న ఈ విషయమేమిటో మనమూ తెలుసుకుందా… ఆచరించి ఆనందిద్దాం…

అనగనగా ఒక మారు  ఉత్తర భారతదేశం నుండి ఓ భక్తుడు  కంచి మహాస్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చాడు.  అతనికి స్వామివారితో మాట్లాడే అవకాశం చిక్కడంతో ఎంతో మురిసిపోతూ స్వామీ… ఆంజనేయస్వామి వారిని భారతదేశమంతటా ఆరాధిస్తారు. అయితే ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు, ఉత్తర భారతంలో జాంగ్రి మాలలతో పూజిస్తారు అని అడిగారు.   అందుకు మహాస్వామి వారు హనుమంతుని గురిన్చి ప్రస్తావన రావడంతో సంతోషించి, ఇలా చెప్పారట.

చిన్నతనంలో పసిపాపలకు తల్లులు జాబిల్లిని పిలుస్తూ బువ్వ తినిపిస్తారు కదా…  ఎందుకంటే చందమామ , వెన్నెలా పసివాళ్లకు హాయి కలిగిస్తాయి, అలాగే మన బాల హనుమ ఆకాశములో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు.

అదే సమయంలో సూర్యున్ని మ్రింగాలని రాహువు కూడా వస్తున్నాడు. వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు. హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహువు ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహు దోషము నుండి విముక్తి కలుగుతుంది, రాహువు వారిని బాధించదు అంటూ వరం ప్రసాదించాడు..

ఆ చేసిన వంటకమును హారముగా కాని లేదా రాహు స్వరూపమైన పాముగా కాని చేసి హనుమంతునికి నివేదన చేయవలెనన్నిది నియమం. రాహు గ్రహము యొక్క ఇష్ట ధాన్యము మినుములు కావున దానితో వండిన పదార్థము రాహువుకు అత్యంత ప్రీతిపాత్రము అని చెబుతూ..

దక్షిణాన ఉప్పు ఎక్కువగా తయారు చేస్తారు. ఉత్తరాన చెరుకును ఎక్కువగా పండిస్తారు. వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు, కారము అందులో కలుపుతారు. అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సంప్రదాయం.

ఉత్తరభారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. జాంగ్రి కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహువు చెప్పినట్టు మినుములతో వండిన తీపి వంటకాన్ని వారు మాల రూపములో హనుమంతునికి నివేదిస్తారు అంటూ సందేహనివృత్తిచేశారు. ఇది తెలుసుకుంటే హనుమకు వడ మాల వేయడంలోని ఆంతర్యం గ్రహించినట్టే.

మామాట:  హనుమభక్తులకు గొప్ప సందేహం తీరినట్టే…. శ్రీ  ఆంజనేయా

(Visited 22 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: