గుర్నాధరెడ్డి టీడీపీ వీడడానికి కారణం అదేనా

Share Icons:

అనంతపురం, జనవరి 2:

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. పార్టీలే కాదు.. నేతలు కూడా భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆ పార్టీని వీడారు. ఊహించని విధంగా గుర్నాథ్ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

వాస్తవానికి గుర్నాథ్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ తరపునే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయారు. అనంతపురంలో బలమైన అనుచరగణం ఉన్న ఆయనన.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు. అప్పుడు జేసీ కుటుంబం తప్ప మిగిలిన వారందరూ ఆయన చేరికను వ్యతిరేకించారు. అయినా, ఇన్ని రోజులు అదే పార్టీలో కొనసాగారు. ఆదివారం ఆయన టీడీపీకి రాజీనామా చేయడంతో, జనసేనలోకి వెళ్తారని అంతా భావించారు. కానీ, వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీని వీడే సమయంలో ”చంద్రబాబునాయుడు పాలన బాగుందని తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తప్పుచేశా. ఆయన ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు” అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో గుర్నాథ్ రెడ్డికి పార్టీలో చేరినప్పటి నుంచి గుర్తింపు దక్కలేదని, అందుకే ఆయన టీడీపీకి రాజీనామా చేశారని ప్రచారం జరిగింది.

వాస్తవానికి గుర్నాథ్ రెడ్డి పార్టీని వీడడం వెనుక పెద్ద కథే ఉందట. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో గుర్నాథ్ రెడ్డి, ఆయన సోదరులు మిస్సమ్మ బంగ్లాను ఆక్రమించుకున్నారని వారిపై అభియోగాలు వచ్చాయి. ఈ కేసు సీబీఐకు వెళ్లింది. వాళ్ల విచారణలో సుమారు రూ. 200 కోట్లు విలువ చేసే బంగ్లాను ఆక్రమించుకున్నట్లు తేలింది. దీంతో ఏడుగురిపై 420, 406, 461, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1 రెడ్డప్పరెడ్డి, ఏ2 గుర్నాథరెడ్డి, ఏ3 ఎర్రి స్వామిరెడ్డి వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, శాంతిమూర్తిసహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. గతంలో గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరిన క్రమంలో ఈ కేసు నుంచి తప్పించుకోవాలని భావించారట. అయితే, చంద్రబాబు మాత్రం తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పారని, అందుకే ఆయన పార్టీ వీడారని ప్రచారం జరుగుతోంది.

మామాట: ఓహో…ఇంత స్టోరీ ఉందా

Leave a Reply