కాశ్మీర్ ఆందోళ‌న‌ల‌కు ఎవ‌రు కార‌ణం?

Share Icons:

కాశ్మీర్ ఆందోళ‌న‌ల‌కు ఎవ‌రు కార‌ణం?

జ‌మ్మూ కాశ్మీర్‌లో అస్థిర ప‌రిస్థితులు నెల‌కొన‌డానికి భార‌త తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ అనుస‌రించిన విధానాలే కార‌ణ‌మ‌ని ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటున్నారు.

అప్ప‌టి ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌వ‌హ‌ర్‌లాన్ నెహ్రూ కొన్ని నిర్ణ‌యాలు తీసుకుని ఉండ‌వ‌చ్చు.

దేశ స‌మ‌గ్ర‌త‌ను కాపాడుకోవ‌డానికి, కాశ్మీర్‌ను భార‌త్‌లో అంత‌ర్భాగంగా చేసుకోవ‌డానికి ఆనాటి ప‌రిస్థితుల కార‌ణంగా ఆ రాష్ట్రానికి కొన్ని మిన‌హాయింపులు ఇచ్చి ఉండ‌వ‌చ్చు.

ఆ మిన‌హాయింపులు ఇప్పుడు అంటే 70 ఏళ్ల త‌ర్వాత గుదిబండ‌లుగా మార‌వ‌చ్చు.

కాశ్మీర్ కోసం ఆ నాడు తీసుకున్న నిర్ణ‌యాలు క‌చ్చితంగా అక్క‌డి వేర్పాటు వాదాన్ని ప్రోత్స‌హిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

అంత మాత్రాన గ‌త పాల‌కులు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని ఇప్పుడు అన‌డం మాత్రం స‌మంజ‌సం కాదు.

భార‌త రాజ్యాంగాన్ని ఇప్ప‌టికి 122 సార్లు మార్చుకున్నాం. మ‌రి అలానే కాశ్మీర్‌లోనూ చేయ‌వ‌చ్చు క‌దా?

వాజ్‌పేయి స‌మ‌యంలో, ఇప్పుడు బిజెపికి ఆ సానుకూల‌త ద‌క్కింది క‌దా? మ‌రి ఎందుకు చేయ‌లేదు. అంతే కాదు. నాలుగేళ్ల కింద‌ట ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేంద్ర మోడీ ఏం చెప్పారు?

కాశ్మీర్‌ను స‌మూలంగా మార్చేస్తాన‌ని చెప్ప‌లేదూ? ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తాన‌ని చెప్ప‌లేదూ? మ‌రి నాలుగేళ్లుగా అందుకోసం చేసిన ప్ర‌య‌త్నాలు ఏమిటి?

జమ్మూ కాశ్మీర్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడుకోవ‌డానికే మోడీ ప్ర‌భుత్వానికి స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు. అక్క‌డి బిజెపి సంకీర్ణ ప్ర‌భుత్వంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిక్కులేదు.

రాజ‌కీయంగా భిన్న సిద్ధాంతాలు ఉన్న పార్టీతో అక్క‌డ బిజెపి అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది. ఇలాంటి రాజ‌కీయ విష‌యాల్లో రాజీ ధోర‌ణి అవ‌లంబిస్తున్న మోడీ కాశ్మీర్ ప‌రిస్థితి దిగ‌జారి పోవ‌డానికి కార‌ణం అంటే స‌రిపోతుందా?

దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన కొత్త‌లో తీసుకున్న ఆ నిర్ణ‌యానికి ఇప్ప‌టి ప‌రిస్థితికి బేరీజు వేసి చూస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం లాంటిదే ఈ విమ‌ర్శ కూడా అవుతుంది. శాంతి భ‌ద్ర‌త‌ల అంశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వానికే ఇవ్వాల‌ని బిజెపి గ‌తంలో భావించేది.

అయితే కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ విష‌యం ప‌క్క‌న పెట్టింది. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టానికి కేంద్ర బ‌ల‌గాల‌ను క్ర‌మేపీ త‌గ్గిస్తామ‌ని కూడా బిజెపి చెప్పింది. మ‌రి చేస్తున్న‌దా?

చేయ‌గ‌లుగుతున్న‌దా? అధికారంలో లేన‌ప్పుడు ఒక మాట వ‌చ్చిన త‌ర్వాత ఒక మాట చెప్పే రాజ‌కీయ పార్టీల వ‌ల్లే దేశంలోని రాజ‌కీయ వ్య‌వ‌స్థ రోజు రోజుకు త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పొతున్న‌ది.

అందుకే గ‌త పాల‌కుల‌ను విమ‌ర్శించ‌డం ప్ర‌స్తుత పాల‌కులు మానేయాలి. తామేం చేయాలో ఏం చేస్తామో స్ప‌ష్టంగా చెప్పి చేయ‌డం ప్రారంభిస్తే మ‌ళ్లీ ప్ర‌జ‌లు రాజ‌కీయ నాయ‌కుల‌ను న‌మ్మ‌డం మొద‌లు పెడ‌తారు.

బాగా పెరిగిన చొర‌బాట్లు

ఇటీవ‌లి కాలంలో కాశ్మీర్‌లో పాకిస్తాన్ ముష్క‌రుల చొర‌బాట్లు ఎక్కువ‌య్యాయి. ఒక రోజు కింద‌ట జమ్మూకాశ్మీర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. జమ్మూ నగర శివారులోని ఒక సైనిక శిబిరంపై దాడి చేసి, ఇద్దరు సైనికులను పొట్టనబెట్టుకున్నారు.

ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు మహిళలు, చిన్నారులు; ఒక మేజర్‌ స్థాయి అధికారి సహా నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.

జమ్మూ ప్రాంతంలో 15 నెలలుగా నెలకొన్న ప్రశాంతతకు తూట్లు పొడుస్తూ ముష్కరులు ఈ దాడికి తెగబడ్డారు. చివరిసారిగా ఈ ప్రాంతంలో 2016 నవంబర్‌ 29న జమ్మూ శివార్లలోని నగ్రోటా శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.

తాజాగా జమ్మూకాశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫ్యాంట్రీ దళానికి చెందిన 36వ బ్రిగేడ్‌ శిబిరాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. సైనిక శిబిరంలోకి చొరబడ్డ ఉగ్రవాదుల సంఖ్య నిర్దిష్టంగా తెలియలేదు.

హతమైన ఉగ్రవాదుల వద్ద లభ్యమైన వస్తువులను బట్టి వారంతా జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులని స్పష్టమవుతున్నట్లు సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో జమ్మూలో అప్రమత్తత ప్రకటించారు.

నగరం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సైనిక శిబిరం చుట్టూ ఐదు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలను ముందుజాగ్రత్త చర్యగా మూసేశారు.

తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ జిల్లా పాకిస్థాన్‌తో సరిహద్దును కలిగి ఉంది. 2016లో ఇక్కడ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది.

2017లో దాదాపుగా 220 సార్లు పాకిస్తాన్ సైన్యం కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దాదాపుగా 110 సార్లు ఉగ్ర‌వాదులు మ‌న కంచె దాటేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.

ఇవి కాకుండా జ‌మ్మూలో వేర్పాటు వాద కార్య‌క్ర‌మాలు గ‌త ఏడాది ఎన్నో రెట్లు పెరిగాయి. దీనికి అక్క‌డి రాజ‌కీయ పార్టీల అండ‌దండ‌లు ఉన్నాయి.

రెండు రోజుల కింద‌ట నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌కు చెందిన ఒక ఎంఎల్ ఏ పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు. ఇదీ అక్క‌డ జ‌రుగుతున్న రాజ‌కీయం.

మోడీ గ‌త పాల‌కుల‌ను విమ‌ర్శించ‌డం ప‌క్క‌న పెట్టి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు రాజ‌కీయ ప‌రిష్కారం కొనుగొనాలి.

 

English Summery: Jummu Kashmer situation is being deteriorated day by day. Jaishe mohammed militants attacked on Indian Army.

Leave a Reply