మామాట లో మీమాట పోల్ నెం.16 – పింక్ డైమండ్ జంప్!? తీగ లాగితే…..

Share Icons:

తిరుపతి, మే 29 :

పింక్ డైమండ్… పింక్ డైమండ్… ఏమిటీ పింక్ డైమండ్… ఆ పింక్ డైమండ్ పేరు చెబితే ప్రభుత్వం కూడా ఉలిక్కిపడుతోంది. ఎందుకు?

 

[yop_poll id=”26″]

ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. స్వామిజీలు.. అర్చకులు.. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అందరినీ తన చుట్టూ తిప్పుకుంటున్న ఈ పింక్ డైమండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్ళింది? దేశపు ఎల్లలు ఎలా దాటింది? చివరకు ఏడుకొండలవాడిని సైతం చర్చలోకి లాగి ప్రకంపనలు సృష్టిస్తోంది. అందరిలోనూ ఎందుకంత ఆందోళన? దానిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి  కాపాడుకోలేకపోయిందా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం అందరి మస్తిష్కాలను తొలచేస్తున్నాయి.

వేంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు అపురూపమైన కానుకలు ఇస్తుంటారు. ఈ ఆనవాయితీ ఫలానా సమయంలో ఆరంభమయ్యిందని అసలు చెప్పలేముగానీ, వెయ్యేళ్ల చరిత్రకు మాత్రం కొన్ని సాక్షాలు ఉన్నాయి. పల్లవ రాణి సమవాయి, శ్రీ కృష్ణ దేవరాయలు, మైసూరు మహరాజు ఇలా కొందరు రాజులు, చక్రవర్తులు ఇచ్చిన కానుకలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఓ అంచనా ప్రకారం వెంకన్న బంగారు ఇంచుమించు రూ. 50 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఇక వాటికి యాంటిక్ విలువను జత చేస్తే ఎంతకు చేరుతుందో చెప్పలేం. ఒక్క శ్రీకృష్ణ దేవరాయలు నుంచే అపురూపమైన కానుకలు అందాయి. వాటిని వెల కట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. వాటిలో ఎన్ని ఉన్నాయో..? ఎన్నిపోయాయో? ఆ వెంకన్నకే ఎరుక. పురావస్తు శాఖ అధికారులు చెప్పే ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలలో 10 శాతం కూడా లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవే ఉండి ఉంటే వాటి విలువ లక్షల కోట్లు ఉండేదేమో… తాజాగా ఓ పింక్ డైమండ్ కొండపై ప్రకంపనలు సృష్టించింది. పింక్ డైమండ్ మాయమయ్యిందని మాజీ ప్రధానర్చకులు రమణదీక్షితులు చెబుతుంటే, అసలు పింక్ డైమండ్ అనేదే లేదని టీటీడీ ధర్మకర్తల మండలి మరియు  ప్రభుత్వం వాదిస్తున్నాయి.

పింక్ డైమండ్ ఎవరిచ్చారు?

వేంకటేశ్వర స్వామి ఒంటిపై నగలు దగదగా మెరిసిపోతుంటాయ్… వాటి అలంకరణతో వెంకన్న తన వైభవాన్ని చాటి చెబుతుంటాడు. ఆ నగలన్నింటిలోనూ వెంకన్న ఎదపై  గులాబి రంగు వజ్రం ఎంతో  ఆకర్షణీయంగా కనిపించేది. ఇప్పుడు ఆ డైమండ్ కనిపించడం లేదు. ఏమయ్యింది.? ఈ అంశమే ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. దానిని మైసూరు మహరాజు ఇచ్చినట్లు చెబుతున్న కానుకల్లో చాలా అరుదైనది ఈ పింక్ డైమండ్‌ అంటారు. 2001లో భక్తులు విసిరే నాణేల వలన పింక్ డైమండ్ పగిలిపోయిందని రికార్డులు చెబుతున్నాయి. ఈ విషయం తొలిసారిగా 2008లో వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆభరణాలలోని నగలు మాయమవుతున్నాయని తీవ్ర  ఆరోపణలు చేశారు. విచారణకు డిమాండ్ చేశాడు. అప్పట్లో డాలర్ల కుంభకోణం కేసులో విచారణ చేస్తున్న సివిఎస్‌వో (‌ఐఏఎస్ అధికారి) రమణ కుమార్ తన నివేదికలో పింక్ డైమండ్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాని విలువ వందల కోట్లు ఉంటుందని తెలిపారు. అంటే ఇక్కడ పింక్ డైమండ్ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.

డైమండ్ ఎక్కడికెళ్లింది?

ఈ మధ్యకాలంలో ప్రధానర్చకులకు టీటీడీ బలవంతపు పదవీ విరమణ కల్పించింది. వారి స్థానం నూతన అర్చకులను నియమించింది కూడా. బలవంతపు పదవీ విరమణ కంటే ముందు రమణదీక్షితులు అనేక అంశాలను ప్రస్తావిస్తూ పింక్ డైమండ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అది చాలా కాలంగా కనిపించడం లేదని ఆరోపించారు. అలాంటి డైమండే జెనీవాలో రూ. 500 కోట్లకు వేలానికి వచ్చిందని తెలిపారు. ఆ డైమండే వెంకన్న హారంలోని డైమండ్ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి టీటీడీ పాలక మండలిలో గుబులు పుట్టుకుంది. ఇక్కడ నుంచి రాజకీయ రంగు పులుముకుని పింక్ డైమండ్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అసలు పింక్ డైమండే లేదు అని టీటీడీ వాదిస్తోంది. ప్రభుత్వమూ అదే పాట పాడుతోంది. అది రూబీ అని అందుకే పగిలిందని చెబుతున్నారు. కానీ, రికార్డులలో మాత్రం అక్కడక్కడ పింక్ డైమండ్ ప్రస్తావన వచ్చింది. పింక్ డైమండ్ మాయమయ్యిందని రమణదీక్షితులు, నరసింహదీక్షితులు కూడా 2008లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు మాజీ సీవీఎస్వో రమణ కుమార్ తెలిపారు. నాడు చంద్రబాబు నాయుడే నగల మాయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరి నేడు పింక్ డైమండ్ లేదనడం వెనుక ఆంతర్యం ఏంటి? ఎక్కడికెళ్లింది? ఇవే సమాధానం దొరకని ప్రశ్నలు.

పాలకమండలి ఎందుకుంది?

టీటీడీ బోర్డు కంటే ముందు హథీరాంజీ మఠం, అంతకు ముందు బ్రిటీష్ వారు, అంతకు ముందు కొంత కాలం రాజుల కూడా తిరుమల ఆలయాన్ని పర్యవేక్షించారు. ప్రస్తుత బోర్డు కంటే ముందు ఎవరు చూసినా భక్తుల రద్దీ, భక్తుల సౌకర్యాలు ఏర్పాట్లే పరమ లక్ష్యంగా పని చేశారు. బోర్డు ఏర్పడిన తరువాత కూడా కొంత కాలం అదే జరిగింది. కైంకర్యాలు, పూజలు అర్చకులు చూసుకునే వారు. నగలు కూడా అర్చకుల ఆధీనంలోనే ఉండేవి. అయితే 1987లో మిరాశీ వ్యవస్థ రద్దయిన తరువాత నగలు పాలకమండలి ఆధీనంలోకి వెళ్లాయి. అర్చకులు కోర్టు కెళ్ళడంతో కొన్నాళ్లపాటు ఇద్దరి చేతుల్లో ఉండేది. తరువాత నెలల వ్యవధిలోనే బోర్డు చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి బోర్డు బొక్కసానికి (నగలు భద్రపరిచే ప్రదేశం) పాలకమండలి ఇక్కడ ఎటువంటి నియామకాలు చేపట్టకుండా కేవలం ఒక వ్యక్తి చేతుల్లో పెట్టి చేతులు దులుపుకుని పట్టీపట్టనట్లు వ్యవహరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బొక్కసానికి ప్రత్యేకమైన నియామకాలు లేవు. ఈ క్రమంలోనే అనేకమైన అనుమానాలు చుట్టుముట్టాయి. అర్చకుల చేతుల్లో భద్రత ఉండదని వాదించిన టీటీడీ బొక్కసం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నియామకమైన ప్రతి పాలకమండలికి, కార్యనిర్వహణాధికారికి పింక్ డైమండ్ అదృశ్యమైన విషయాన్ని అర్చకులు వివరిస్తూనే వచ్చారు. విఐపీల సేవలో తరించే పాలకమండళ్ళు, అధికారులకు దీనిని పట్టించుకునే తీరకే లేకుండా పోయింది. భక్తులు ఇచ్చే ప్రతిపైసాకు, ప్రతి కానుకకు బాధ్యత వహించాల్సిన పాలకమండలి చేతగాని తనం కనిపిస్తూనే ఉంది. సమాధానం చెప్పాల్సింది పాలకమండలే. విచారణ జరిపించి పింక్ డైమండ్ నిగ్గు తేల్చాల్సింది పాలకమండలే. భక్తుల కానుకులకు బాధ్యత వహించాల్సింది పాలకమండలే. అలాంటి పాలకమండలి చేతులెత్తేస్తే, అసలు డైమండే లేదనే వాదన తీసుకొస్తే శ్రీవారి నగలు, ఆస్తులకు వీరు భద్రత కల్పిస్తారంటే మనం ఎలా నమ్మగలం?

మామాట : కంచే చేను మేసిందా…? దొంగలకు దారి చూపిందా..?

Leave a Reply