ప్రభుత్వంలో రోజా రోల్ ఏంటి ?

Share Icons:

అమరావతి, మే 13,

ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు మంత్రి పదవులు విషయంలో ఎవరికి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొందరికి మంత్రి పదవులు ఇస్తానని ప్రకటించిన వైఎస్ జగన్… ఆ తరువాత ఏ ఒక్కరికీ ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాల్లోచర్చ జరుగుతోంది.

మిగతా వారి సంగతి ఎలా ఉన్నా… టీడీపీ హయాంలో వైసీపీ తరపున బలంగా తన వాయిస్ వినిపించిన నగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి, జబర్దస్త్ షో జడ్జి రోజాకు జగన్ కేబినెట్‌లో బెర్త్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. రోజాకు హోంమంత్రి పదవి ఖాయమనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ నేతను పక్కనపెట్టి రోజాకు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

చిత్తూరు జిల్లా నుంచి కేబినెట్ బెర్త్‌ల విషయంలో తొలి ప్రాధాన్యం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే ఉంటుందని భావిస్తున్నాయి. అయితే రోజాకు వైసీపీ ప్రభుత్వంలో సుముచిత స్థానంతో పాటు కేబినెట్ ర్యాంకు ఉన్న పదవి ఇవ్వాలనే భావనతో ఉన్న వైఎస్ జగన్… ఆమెకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తనదైన వాగ్దాటితో ప్రతిపక్షాలను కట్టడి చేయగల సత్తా ఉన్న రోజాకు చీఫ్ విప్ పదవి ఇవ్వడం వల్ల… అసెంబ్లీలో విపక్షాలకు చెక్ చెప్పొచ్చనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది.

మొదట ఆమెకు చీఫ్ విప్ పదవి ఇచ్చి… ఆ తరువాత పరిస్థితులను బట్టి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే భావనలో వైసీపీ అధినేత ఉన్నారని ఆ పార్టీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని… ఫలితాలు వెలువడిన తరువాతే దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏదేమైనా… వైసీపీ అధికారంలోకి వస్తే రోజా పాత్ర ఏ రకంగా ఉండబోతోందనే అంశంపై క్లారిటీ రావడానికి మరికొద్దిరోజుల సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మామాట: మాటల తూటాలు విడిచేవారు కావొద్దా..

Leave a Reply