మామాట లో మీమాట పోల్ నెం.15 – తిరుమల ఆలయంలో ఏమి జరుగుతోంది? సూత్రధారులెవ్వరు?

Share Icons:

తిరుమల, మే 18 :

తిరుమల ఆలయంలో అధికారులు తమ ఆధిపత్యం కోసం అర్చకత్వాన్ని రోడ్డుకీడ్చారు. అర్చకులను రెండు వర్గాలుగా చీల్చి  తమ పంతాన్ని నెగ్గించుకున్నారు.

 

[yop_poll id=”24″]

ఏం చేయాలో… ఏమి చేయకూడదో కూడా అంతగా అవగాహన లేని పాలకమండలితో ఆమోద ముద్ర వేయించుకున్నారు. అనాదిగా వస్తున్న అర్చకత్వంపై అక్కడున్న అధికారులకు ఎందుకంత అక్కసు. మిరాశీ అర్చకత్వంపై కత్తికట్టడం సమంజసమా? అసలు తిరుమలలో ఏం జరుగుతోంది.? సూత్రధారులెవ్వరు? పాత్రధారులెవ్వరు?

తిరుమల ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వహించే అర్చక కుటుంబాలు నాలుగు ఉన్నాయి. ఇది నేటిది కాదు. తరతరాల నాటిది. అది ఎప్పటి నుంచి కొనసాగుతుందో కూడా చాలా మందికి తెలియదు. ఈ నాలుగుకుటుంబాల వారు తిరుమలకు నడకదారి కూడా సరిగాలేని రోజులనుండీ వారే అర్చకత్వం చేస్తున్నారు. తరాలు మారుతూ వచ్చాయి. 19వ శతాబ్ధం నుంచి ఆలయానికి ఆదాయం ప్రారంభమయ్యింది. బ్రిటిష్ పాలకులు కూడా స్వామివారి పట్ల మంచి శ్రద్ధనే చూపారు. అనేక మార్పులు తీసుకువచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులను నియమించారు. తరువాత వారే హథీరాంజీ మఠానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడెక్కడా అర్చకత్వంపై వేలు పెట్టలేదు. కైంకర్యాలలో కలుగుజేసుకోలేదు. 1950 లో తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనకు ప్రత్యేక పాలకమండలి ఏర్పడింది. హుండీ ఆదాయం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యింది. కైంకర్యాల బాధ్యతలను అర్చకులు, జీయర్ స్వాములు, ఆచార్యపురుషులు మాత్రమే నిర్వహించేవారు. ఆస్థానపండితులూ ఉండేవారు. స్వామివారి కైంకర్యానికి వచ్చే ద్రవ్యములు, ప్రసాదములు అర్చకులకు వచ్చేవి. వారికి ప్రత్యేక జీతభత్యాలు ఏమి లేవు. ద్రవ్యములు, ప్రసాదాల ఆదాయంతోనే అర్చకులు జీవనం చేసేవారు. ఇలా కొన్ని తరాలు జరిగింది.

ఎన్టీయార్ హయాంలో ఏం జరిగింది.

అర్చక మిరాశీ వ్యవస్థలో తొలిసారి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలుగజేసుకున్నారు. అర్చక వ్యవస్ధపై కమీషన్ వేశారు. ఆ కమీషన్ ‘అర్చకులు వంశపారంపర్య హక్కు ద్వారా, వారికుటుంబాలవారే అర్చకులుగా ఉంటున్నారు.. ఇది తప్పు! ఆలయాలలో అర్చకులకు జీతభత్యాలు ఇచ్చి, అక్కడ ద్రవ్య ఆదాయం తీసివేయాలి’ అనే ప్రతిపాదన చేసింది. అంతే వారి హక్కులను తీసేశారు. అది మొత్తం రాష్ట్రానికి వర్తించింది. కొన్ని వేల గుళ్ళలోని అర్చకుల కుటుంబాలలో అల్లకల్లోలం చెలరేగింది. అర్చకులు లేక ఆలయ భూముల నుంచి ఆదాయంతో నడిచే ఆలయాలు దూపదీప నైవేద్యాలకు నోచుకోక మూతపడ్డాయి. అర్చకుల వారసులు ఇతర వృత్తుల వైపు మర్లారు..

అయితే తిరుమల అర్చకులు మాత్రం తొలిసారిగా కోర్టు తలుపుతట్టారు. 1987నుండి 1996 వరకు 9 యేళ్లపాటు కోర్టులో కేసు జరిగింది. వంశ పారంపర్య హక్కు అర్చకులకు లేదని, కానీ ప్రస్తుతం ఉన్నవారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, వారికి ద్రవ్య ఆదాయం మినహా అన్ని గౌరవమర్యాదలు ఇవ్వాలని, ఆగమకైంకర్యాలు వారు చెప్పినట్లే నిర్వహించాలని కోర్టు టీటీడీకి సూచించింది. టీ.టీ.డీ వారు ఇంతటితో వదల్లేదు. దేవుడి తరువాత దేవుడంతటి పూజారిని వెంబడించారు. అర్చక కుటుంబాలను కోర్టు కేసులతోనే వేధించారు. కేసు జరుగుతున్న రోజులలో ద్రవ్యఆదాయాన్ని అర్చకులు తీసుకున్నారు గనుక, దానిని తిరిగికట్టాలని కోర్టులో కేసువేసి గెలిచారు. దానితో అప్పటినుండీ, అర్చకులకు సంబంధించిన నలుగురి ఇళ్ళు తనఖా పెట్టుకొని, వారికి ఇచ్చే జీతంలో ప్రతినెలా డబ్బు పట్టుకొని మరీ ఇస్తున్నారు. ఇప్పటికీ 9 మంది అర్చకుల జీతంలో ఈ డబ్బు మినహాయిస్తూనే ఉన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అప్పుడు ఉన్న అర్చకులను తీసివేయకూడదు. అలాగే వారు చెప్పినట్లే కైంకర్యాలు నిర్వహించాలి. వారి గౌరవం వారికి ఉండాలి అని చెప్పినందున ఆ తీర్పు వచ్చేనాటికి ఎంతమంది దేవాలయంలో పనిచేస్తున్నారో వారిని టీటీడీ తమ ఉద్యోగులలాగా భావిస్తూ జీతాలు ఇవ్వడం ప్రారంభించింది. రాజశేఖరరెడ్డి  ముఖ్యమంత్రి అయ్యాక, వంశపారంపర్య హక్కుకు సంబంధించి ఎండోమెంట్లో ఒక జీ.వో తెచ్చారు. దాని సారాంశం ఏమంటే- పూర్వము నుండి దేవాలయాన్ని నమ్ముకున్న అర్చక కుటుంబాలలో సమర్థులైన (అంటే) ఆగమ శాస్త్రాన్ని చదువుకున్న వారసులు ఉంటే, ఇప్పుడు వారు చేస్తున్న అర్చక ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇవ్వమని సిఫార్సు చేయవచ్చు.. అతను సక్రమంగా చదువుకొని ఉంటే, ఆ ఉద్యోగం అతనికే ఇవ్వాలి అన్నారు.

కొంత ఊరట కలిగింది. ఆలయం శోభాయామానంగా వెలుగుతోందంటే అందులో అర్చకుల పాత్ర అనిర్వచనీయమైనది. అందులో అనుమానం లేదు. వేంకటేశ్వర స్వామి అలంకరణ అద్భుతంగా ఉందంటే అందులో అర్చకుల కష్టం ఉంది. అయితే వారి జీతాలు మాత్రం దారుణంగా ఉండేవి. జీతం రూ.8 వేలు మాత్రమే ఉండేది. 2010లో శ్రీకృష్ణారావు గారు తిరుమల మరియు గోవిందరాజస్వామి అర్చకుల జీతాలను కొంతమందికి ₹33000 చేశారు. ఇప్పటికీ టీ.టీ.డీ లో పనిచేసే 350మంది అర్చకుల జీతం ₹17000 మాత్రమే. అక్కడ పని చేసే చాలా మంది నాలుగో తరగతి ఉద్యోగుల జీతాలు కూడా వీరికి అందడం లేదు.

1999లోనే అర్చకులు సుప్రీంకోర్టు 3 జడ్జీల బెంచికి కేసు పునఃపరిశీలనకు అడిగారు. 3 జడ్జీల బెంచ్ దానిని విచారణకు స్వీకరించింది. 2012 దాకా దాని విచారణ కొనసాగుతూనే ఉంది. 2012లో సుబ్రమణ్యం ఈ.ఓ గా ఉండగా, “మీకు మంచి జీతాలు ఇస్తున్నాం గౌరవంగా చూస్తున్నాం! మీ తరువాత యోగ్యులైన మీ కుమారులకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కదా! మరి మీరెందుకు ఇంకా కేసు వాదిస్తారు? వెనక్కి తీసుకోండి” అని నచ్చజెప్పడంతో, అర్చకులు కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ జడ్జిగారు అడిగారు- “మీకు అన్ని మర్యాదలు జరుగుతున్నాయా? మీ కుమారులకు అర్చకత్వం ఇస్తున్నారా? ఒకవేళ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా నేరుగా 3బెంచి జడ్జీల దగ్గరకు రావచ్చు” అని చెప్పి, కేసు వెనక్కు ఇచ్చారు. సాధారణంగా ఒకకేసు లో ఎవరూ అలా అనరు కానీ ఇప్పటికీ అర్చకుల హక్కులైన ఆలయ కైంకర్యాల నిర్వహణ, ఉత్సవాల నిర్వహణ, వంశ పారంపర్య హక్కుల ద్వారా ఉండే మర్యాదలు, అర్చకులకు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది.

అధికారుల వేధింపులు షురూ

తిరుమల అర్చకులు కేసును సుప్రీంకోర్టు ఉపసంహరించుకున్న తరువాత నుండి అధికారులు వారిపై తమ అసలు స్వరూపాన్ని ప్రారంభించారు. భక్తుల రద్దీ సాకుగా కైంకర్యాలు వేళలు మార్చడం, స్వామివారికి ఏ ఆభరణాలు అలంకరించాలి? బ్రహ్మోత్సవాలు ఎవరు చేయాలి? పవిత్రోత్సవాలు ఎవరుచేయాలి? ఇటువంటి ఎన్నో ఆగమపరమైన నిర్ణయాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రధాన అర్చకులు వ్యతిరేకించినా లెక్క పెట్టలేదు. చాలా కాలంగా అక్కడ తిష్ట వేసిన ఓ అధికారి తన ఇష్టానుసారం వేళల్లో మార్పులకు అర్చకులపై ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఇక అందుకు రమణదీక్షితులు లాంటి ప్రధానార్చకులు ఒప్పుకోక పోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తనకే ఎదురు చెబుతారా? అనే కక్షను పెంచుకున్నారు. ఈవోలు ఎందరు మారినా ఆ అధికారి మాత్రం కొండ దిగడు. మరో రెండేళ్ళపాటు ఆయనే కొనసాగేలా ఉత్తర్వులు కూడా తెప్పించుకున్న ఘనుడు. ఇక తనకు అడ్డు చెప్పే అర్చకుల పని పట్టాలనుకున్నాడు. అక్కడున్న అర్చకులలో చీలిక తీసుకు రాగలిగాడు.

ఆయన ఆగడాలను భరించలేని కొందరు అర్చకులలో రమణ దీక్షితులు ఒకరు. ఆయన గుడిలో జరుగుతున్న వ్యవహారాన్నిమీడియాద్వారా బట్టబయలు చేశారు. దీంతో ఆ అధికారికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఒకేమారు నలుగురు ప్రధానార్చకులకు మంగళం పాడేశాడు. కోర్టు ఉత్తర్వులు లేదు. కోర్టులో కేసులను వాటి తీర్పులను పట్టించుకోకుండా తాను అనుకున్న పనిని పాలకమండలి ద్వారా చేయించేశాడు. ఏమాత్రం అవగాహన లేని పాలకమండలి ఉండడం ఆ ఆధికారికి కలిసివచ్చింది.

అర్చక వ్యవస్థపై మరోమారు తిరుగులేని దెబ్బ వేశారు. ఎవరి కష్టంతో అయితే వేంకటేశ్వర స్వామి ఆలయం ఈ దశకు చేరుకుందో క్రమక్రమంగా వారిపైనే వేటు పడింది. 65 ఏళ్ళు నిండిన అర్చకులు గుడిలో ఉండరాదనే నిర్ణయంతో వారిని ఇంటికి సాగనంపారు. అర్చకత్వం ఉద్యోగం కాదు అనే మాటకు స్వస్తి చెప్పారు. తిరుమలలో అర్చకత్వమూ ఉద్యోగమేనంటూ కొత్త భాష్యం చెప్పేశారు. కైంకర్యాలను ఒకే సారి జూనియర్ల చేతిలో పెట్టేశారు. వారిని ప్రధానార్చకులను చేసేశారు. కొన్ని వందల యేళ్ళుగా వస్తున్న ఆచారానికి మంగళం పాడేశారు. సాంప్రదాయాలను కూలదోసే ఈ పాలకమండళ్ళ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మామాట : ఇక మిగిలింది దేవుడు మాత్రమే… అధికారులు ‘రా’ అంటే బాలాజీ కూడా ‘జీ హుజూర్’ అనాల్సిందేనేమో..!

Leave a Reply