కొత్త ట్రాఫిక్ చట్టం కష్టాలు: మాకొద్దు బాబోయ్ అంటున్న రాష్ట్రాలు

New Traffic Rules forced an Auto Driver to pay Rs.47500 as fine
Share Icons:

ఢిల్లీ:

కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మోటారు వాహన చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఈ జరిమానాల పట్ల వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకిత వస్తుంది. ఆ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాలపైనా పడుతుంది. దీంతో ఈ రూల్స్ మేము పాటించలేమని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేస్తున్నాయి.

మొన్న పంజాబ్‌,నిన్న గుజరాత్‌ లు ఈ చట్టం అమలు చేయలేమని చెప్పేసాయి. ఇక తాజాగా కేరళ, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఈ చట్టంపై చేతులు ఎత్తేసాయి. కేంద్రం రూపొందించిన కొత్త మోటారు వాహన చట్ట సవరణలను యథాతధంగా అమలు చేయరాదని కేరళ, బెంగాల్‌ ప్రభుత్వాలు కూడా నిర్ణయించాయి. అసలు ప్రజలకు భారంగా మారిన ఈ కొత్త చట్టాన్ని అమలు చేసేదే లేదని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.

కేరళ ప్రభుత్వం కొత్త చట్టంపై అధ్యయనం చేసి జరిమానాలను ఎంత విధించవచ్చో సిఫారసు చేయాల్సిందిగా రవాణా శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసింది. అటు ఈ చట్టాన్ని తక్షణం అమలు చేయరాదని, సీఎం యడ్యూరప్ప స్వయంగా దీనిని పరిశీలిస్తున్నారని కర్ణాటక సీఎంవో తెలిపింది. మరోవైపు ఈ చట్టం అమలును తమ రాష్ట్రంలో తాత్కాలికంగా నిలిపివుంచామని మహారాష్ట్ర రవాణా మంత్రి దివాకర్ రావోత్ ప్రకటించారు.

అయితే ఈ కొత్త ట్రాఫిక్ చట్టంపై వాహందారుల నుంచి, రాష్ట్రాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో… కేంద్రం దిగొచ్చింది. దీనిని అమలు చేయడం లేక మానడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. కొత్త మోటారు వాహన చట్టాన్ని అనుసరించడం లేక నీరుగార్చడం అన్నది రాష్ట్రాల ఇష్టమని మంత్రి నితిన్ గడ్కరి తేల్చి చెప్పారు. అయితే ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశమని, కేంద్రం, రాష్ట్రాలు తమకు నచ్చినట్లు చట్టాలు చేసుకోవచ్చని, కానీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ప్రమాదాలకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు.

కాకపోతే రాష్ట్రాల వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఆదాయ మార్గంగా భావించి ఈ భారీ జరిమానాలను విధించాలని మేమీ చట్టం రూపొందించలేదని, ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో లక్షన్నర మంది చనిపోతున్నారని చెప్పారు.  ట్రాఫిక్‌ చలాన్లను తగ్గిస్తారా? అంటే చట్టాన్ని ప్రజలు అనుసరించనక్కరలేదని చెప్పడమే! చట్టం అంటే భయం లేకపోవడమే అని గడ్కరీ విమర్శించారు. కొన్ని రాష్ట్రాలు ఈ కొత్త నిబంధనలను అనుసరించడం లేదని, ప్రాణం కన్నా డబ్బు ముఖ్యమా అని తాను వారిని అడుగుతున్నానని అన్నారు.

Leave a Reply