ఏపీ కోసం ‘మీటూ’ అంటున్న చంద్రబాబు…

we-will-create-metoo-like-movement-for-special-status-says-ap-cm-chandrababu
Share Icons:

శ్రీకాకుళం, 18 అక్టోబర్:

ప్రస్తుతం దేశాన్ని రెండు అంశాలు ఊపేస్తున్నాయి. ఒకటి శబరిమల వివాదం..మరొకటి  ‘మీటూ’ ఉద్యమం.. శబరిమల అంశాన్ని కాసేపు పక్కన పెడితే. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు.. మహిళల మీద జరిపిన వేధింపులకు వ్యతిరేకంగా ఈ మీటూ ఉద్యమం నడుస్తోంది.

ఇక తాజాగా జరుగుతున్న ఘటనలే కాకుండా.. గతంలో ఎప్పుడో జరిగిన విషయాలను కూడా బాధితులు బయటపెడుతున్నారు. మీటూ అంటే ‘నేను కూడా బాధితురాలిని లేదా బాధితుడిని’ అని చెప్పడం.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ‘మీటూ’ తరహా ఉద్యమం చేస్తాని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరూ రాకపోవడంపై విమర్శలు గుప్పించారు. తుఫాన్ బాధితులను ఆదుకునే బాధ్యత కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు.  రాజకీయాలే ముఖ్యమా? అని కేంద్రాన్ని నిలదీశారు. మోదీ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు. బీజేపీ కార్యాలయ శంకుస్థాపనకు ఇది సమయమా అంటూ చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. గుంటూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీకాకుళం రాకుండానే వెళ్లిపోయారని విమర్శించారు

అలాగే, విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నా కూడా కనీసం పక్క జిల్లా శ్రీకాకుళంలో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి రాలేదంటూ ప్రతిపక్ష నేత జగన్ మీద కూడా సీఎం మండిపడ్డారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అంతా సెట్ రైట్ చేసిన తర్వాత వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.

మామాట: మరి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మీటూ అంటే ఏ తరహాలో ఉద్యమం చేస్తారో…

Leave a Reply