అసెంబ్లీలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం…

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఓ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. మీడియాపై ఆంక్షలు విషయంలో ఇరు పక్షాల మధ్య పెద్ద రచ్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే,  టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుగా వెళ్లగా అసెంబ్లీ సెక్యూరిటీ అడ్డుకుంది. ప్లకార్డులతో లోపలికి వెళ్లొద్దని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. తమ ఆఫీసుకు తీసుకెళ్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా సెక్యూరిటీ వినలేదు. సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు, ఎమ్మెల్యేల అసెంబ్లీ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత అసెంబ్లీలోకి వచ్చాక కూడా అచ్చెన్నాయుడు వైసీపీపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటనలను సభలో వివరించిన అచ్చెన్న.. చంద్రబాబును కూడా మార్షల్స్ లాగేశారని మండిపడ్డారు. చీఫ్‌ మార్షల్‌కు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో తెలియదని… చంద్రబాబు, ఎమ్మెల్యేలపై మార్షల్స్‌ చేయి వేశారని ఆరోపించారు. గేటు దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారన్నారు. ప్లకార్డు, బ్యానర్‌, నల్ల బ్యాడ్జీలు వద్దని చెబితే తీసేశామని.. అసెంబ్లీలోకి కాగితాలు కూడా తీసుకెళ్లొద్దని ఆదేశిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేతిలో చిన్న తెల్లకాగితం ఉన్నందుకు 40 నిమిషాలు బయట నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పట్ల మార్షల్స్‌ దారుణంగా ప్రవర్తించారన్నారు. ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని లాగేశారని తెలిపారు.

మధ్యలో కల్పించుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అసెంబ్లీలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావద్దని.. టీడీపీ హయాంలోనే రూల్స్‌ తీసుకొచ్చారని తెలిపారు. మార్షల్స్‌నే టీడీపీ సభ్యులు తోసివేశారని ఆరోపించారు. టీడీపీ సభ్యుల తీరుపైనే మార్షల్స్‌ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీ సజావుగా జరుగుతుంటే.. కావాలనే యాగీ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదన్నారు.

ఇక 2430 జీవో రద్దు అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. ప్రతిపక్ష సభ్యుల విమర్శలపై సీఎం జగన్ మాట్లాడుతూ.. జీవో రద్దుపై ప్రతిపక్ష నేత తీరు ఆశ్చర్యకరమన్నారు. ‘‘జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా..? లేదా ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోవడంలో లోపం ఉందా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా జీవోను సీఎం జగన్ చదివి వినిపించారు. నిరాధార వార్తలు రాసిన వారిపై ఫిర్యాదు చేసే అధికారం.. సంబంధిత శాఖలకు జీవో ద్వారా ఇచ్చామన్నారు. జీవోను తప్పుబట్టేందుకు అవకాశమే లేదన్నారు. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Leave a Reply