మాటల యుద్ధం: టీడీపీ-వైసీపీ-బీజేపీ: ట్రైయాంగిల్ ఫైట్

war words between tdp,ysrcp and bjp leaders in ap
Share Icons:

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మామూలుగానే ప్రత్యర్ధ పార్టీలు గా ఉన్న టీడీపీ-వైసీపీలు ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే మధ్యలో బీజేపీ ఒకోసారి టీడీపీ మీద ఒకోసారి వైసీపీ విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరంలో నేతలు ట్రైయాంగిల్ మాటల యుద్ధానికి తెరలేపారు. బీజేపీ టీడీపీ-వైసీపీ మీద విమర్శలు చేస్తే, టీడీపీ బీజేపీ-వైసీపీ మీద, వైసీపీ బీజేపీ-టీడీపీ మీద విమర్శలు చేశారు.

అసలు ఏమైందంటే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజాగా రాష్ట్ర పరిస్తుతులపై మీడియాతో మాట్లాడుతూ…మాటల యుద్ధానికి తెరలేపారు. అవినీతిపరులైన టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారనీ, వారిని జైలులో పెట్టాలనీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో రెండు లక్షల కోట్లు అవినీతి జరిగిందని, నాటి అవినీతిపై పుస్తకం ముద్రించి పాదయాత్రలో ప్రచారం చేసిన జగన్ ప్రస్తుతం టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తోందని గట్టిగా విమర్శించారు. జగన్ ఒక మతానికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. దేవాలయ భూములను పేదలకు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం చేపడతామంటూ సోము వీర్రాజు హెచ్చరించారు.

అటు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘాటుగా స్పందించారు. వీర్రాజు రాజకీయ దళారి అనీ, ప్రజలనుంచి డబ్బులు వసూలుచేసి పనులు చేయిస్తారనీ గోరంట్ల ఆరోపించారు. సోము వీర్రాజు అవినీతి విషయంలో బ్యాంకు ఖాతాలతో సహా ఆధారాలు బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపైనా గోరంట్ల తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు ఇసుక ర్యాంపుల్లో రాజకీయాలు చేస్తున్నారనీ, దాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నారనీ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలనే గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించుకున్నారని కూడా దుయ్యబట్టారు.

ఇక టీడీపీ, బీజేపీ నేతల మాటలపై వైసీపీ నేత శ్రీఘాకొళపు శివరామ సుబ్రహ్మణ్యం కాస్తంత ఘాటుగానే స్పందించారు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని సోము వీర్రాజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ఇసుక అవినీతి జరిగిందనీ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి నియోజకవర్గంలో జరిగిన ఇసుక అవినీతి అంతా ప్రజలకు తెలుసుననీ ఆయన వ్యాఖ్యానించారు. గోరంట్ల అనుచరులు అవినీతి సొమ్ముతో కోట్లు సంపాదించారని ఆరోపించారు. గోరంట్లకి సీఎం జగన్‌పై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ఇలా మూడు పార్టీల నేతలు మాటల యుద్ధం జరిపారు.

Leave a Reply