TRENDING NOW

ఆ రెండు లోక్‌సభ స్థానాల్లో వైసీపీకి అభ్యర్ధులు కావలెను..!

ఆ రెండు లోక్‌సభ స్థానాల్లో వైసీపీకి అభ్యర్ధులు కావలెను..!

విజయవాడ, 7 జూలై:

కృష్ణా జిల్లా….ప్రస్తుతానికి అధికార టీడీపీ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. 16 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు గల ఈ జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ 10 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగా, 2 లోక్‌సభ స్థానాలని కైవసం చేసుకుంది. అలాగే వైసీపీ తరుపున 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ కైకలూరు నుంచి గెలిచింది. ఇక ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు.

అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీని నిలవరించి వైసీపీ ఎక్కువ అసెంబ్లీ స్థానాలని గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటే, టీడీపీ ఉన్న స్థానాలని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అందుకోసం ఇప్పటినుంచే గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చి బరిలో నిలిపే పనిలో ఇరు పార్టీలు ఉన్నాయి.

రెండు లోక్‌సభ స్థానాలు…

ఇక లోక్‌సభ స్థానాల విషయానికొచ్చేసరికి గత ఎన్నికల్లో రెండు స్థానాలని టీడీపీ గెలుచుకుంది. విజయవాడలో కేశినేని నాని గెలవగా, మచిలీపట్నంలో కొనకళ్ళ నారాయణ గెలిచారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా టీడీపీ తరుపున వీరిద్దరు మళ్ళీ బరిలోకి దిగొచ్చు. ఒకవేళ వీళ్ళు పోటీలో లేకపోయిన ఇక్కడ టీడీపీకి అభ్యర్ధులు కరువు ఉండరు.

కానీ వైసీపీకి మాత్రం అభ్యర్ధులని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున విజయవాడ నుంచి పోటీచేసిన వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం అడ్రెస్ లేరు. ఇక మచిలీపట్నం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పార్థసారథి నెక్స్ట్ అసెంబ్లీకి పోటీ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు చోట్ల పోటీలో నిలిపేందుకు వైసీపీ సరైన అభ్యర్ధులని వెతికే పనిలో పడింది.

అయితే విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు చాలామంది నేతలు వెనుకడుగు వేస్తున్నారు. దానికి కారణం ఈ స్థానం నుంచి పోటీ చేసే వ్యక్తి కనీసం రూ.50 నుంచి 70 కోట్లు వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని నాని లాంటి ప్రత్యర్థిని తట్టుకోవడం అంత తేలిక కాదు.

అందుకనే ఖర్చుని, పోటీని తట్టుకునే వ్యక్తి కోసం ఆ పార్టీ అగ్రనేతలు పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులని సంప్రదిస్తున్నారు. ఒక దశలో ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విజయవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన విశాఖ ఎంపీ స్థానంపై దృష్టి పెట్టారు.

ఇటీవల విజయవాడ నుంచి పార్టీ ఎంపీగా పోటీ చేయించేందుకు నగరంలో హోటళ్ల వ్యాపారంలో స్థిరపడిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దకు ఆ పార్టీ నేతలు రాయబారం పంపారని, వారి ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. అలాగే మరో ముగ్గురు పారిశ్రామికవేత్తలనూ వైసీపీ నేతలు సంప్రదించినా వారు కూడా ఇదే సమాధానం చెప్పారట.

అయితే విజయవాడతో పోలిస్తే మచిలీపట్నంలో భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకున్నా అక్కడ కూడా ఆ పార్టీ అభ్యర్థుల కోసం వెతుకోవాల్సిన పరిస్థితే. మరి  ఈ దశలో ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది అనేది చూడాలి. ఇక్కడ అభ్యర్థులు ఎవరూ దొరక్కపోతే పార్టీలో ఉన్న ఎవరో ఒకరికి నచ్చ చెప్పి బరిలోకి దింపాల్సిన పరిస్థితి జగన్ కి వస్తుంది.

మామాట: మరి జగన్ ఎలాంటి అభ్యర్ధులని బరిలో దింపుతారో?

(Visited 196 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: