వ్యవస్థల గురించి నాడు ఎన్టీఆర్ కు తెలియదు… నేడు జగన్ కు తెలుసు…

Share Icons:
-జగన్ పై మరో సారి ఉండవల్లి ఆశక్తికర వ్యాఖ్యలు
-జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ లేఖ

ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఉండవల్లి చెప్పేదాంట్లో వాస్తవాలు ఉంటాయనే అభిప్రాయాలూ ఉన్నాయి.అందువల్ల ఆయన చెప్పే విషయాలను తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఆశక్తిగా గమనిస్తుంటారు. పార్టీ, వ్యక్తులు , ఏదైనా ,ఎవరైనా కుండబద్దలు కొట్టడం ఆయన స్టైల్ .ఏపీ సీఎం జగన్ పై మరోసారి ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి న్యాయవ్యస్థ విషయంలో ఎన్టీఆర్ ను జగన్ పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

సుప్రీంకోర్టు నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎం జగన్ లేఖ రాసిన అంశాన్ని ఉండవల్లి ప్రస్తాంచారు. అందుకోసం ఆయన నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి పరిస్థితులను ఉదహరించారు.

 

“ఎన్టీఆర్ 1983లో సీఎం అయ్యారు. ఆయన పలువురికి పదవులు కేటాయించడం, ఆ మరునాడే కోర్టు అడ్డుకోవడం ఇలా పలుమార్లు జరిగింది. దాంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. తనకు సన్నిహితుడైన ఓ న్యాయమూర్తిని పిలిపించుకుని, నేను మంచి చేద్దామనుకుంటుంటే కోర్టు ఇలా అడ్డుపడుతుందేమిటని ప్రశ్నించాడట. ఏంటి బ్రదర్, మేం ఇంత మెజారిటీతో గెలిచి వస్తే ఈ కోర్టులేంటి? ఈ కోర్టులను రద్దు చేయడానికి ఏమీ లేదా? అని అడిగాడట. అసెంబ్లీలో తీర్మానం చేసి కోర్టులను రద్దు చేసే అవకాశం లేదా? అని ఆ జడ్జిని అడిగాడట. అప్పుడా జడ్జి బదులిస్తూ, అలా కుదరదండీ. అందుకు రాజ్యాంగం ఉంది. దాన్ని అనుసరించే అందరూ నడుచుకోవాలని అంటూ ఎన్టీఆర్ కు విడమర్చి చెప్పాడట. నాడు ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి నిజంగా వ్యవస్థలకు గురించి తెలియదు. తర్వాత కాలంలో ఆయన అన్ని విషయాలు తెలుసుకుని పరిపాలనలో ముందుకెళ్లాడు.

 

కానీ ఇప్పుడు జగన్ కు అన్నీ తెలుసు. అన్నీ తెలిసే జస్టిస్ రమణకు వ్యతిరేకంగా లేఖ రాశాడు. అయితే ఏదైనా చిన్న చిన్న కేసుల్లో జడ్జిలు తలుచుకుంటే వాయిదాలు ఇవ్వగలరేమో కానీ, ఏకంగా కేసులు కొట్టేయడం ఇప్పటివరకు ఏ జడ్జి తరం కూడా కాలేదు. జగన్ నిర్ణయం తీసుకునేముందు ఎవరివో సలహాలు తీసుకుని ఉంటారు. రేపు తన కేసుల విచారణ జరగబోతుందని తెలిసి కూడా ఇతరుల సలహాల పైనే ఆయన ముందుకెళ్లి ఉంటారని అనుకుంటున్నా. అసలీ రాజకీయాలన్నీ చదరంగం వంటివి. బంటు, శకటు, గుర్రం, ఏనుగు కదిలినంత వేగంగా రాజు కదల్లేడు. ఎటైనా రాజు కదిలేది ఒక స్టెప్పే. అసలీ రాజు కోసమే చదరంగం క్రీడ సాగుతుంది. అయితే తాను చెబితేనే మిగతా బలగాలన్నీ కదులుతున్నాయి… నేను కూడా గుర్రం, శకటు, ఏనుగులా వేగంగా వెళతానని రాజు ముందుకు కదిలితే ఆట రద్దు చేస్తారు” అంటూ ఉండవల్లి వ్యాఖ్యలు చేశారు

 

-కె. రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply