ఆ జిల్లాలో టీడీపీ యాక్టివ్ గా లేనట్టుంది…!

Share Icons:

అమరావతి: ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తి నైరాశ్యంలో ఉన్న విషయం తెలిసిందే. చాలామంది నేతలు ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అటు రాష్ట్రంలో చాలామంది నేతలు బీజేపీ, వైసీపీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఏదో కొద్దిమంది మాత్రమే పార్టీలో యాక్టివ్ గా ఉంటూ అధినేత చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా నేతలు అయితే పూర్తిగా అడ్రెస్ లేరు. మొన్న ఎన్నికల్లో ఈ జిల్లాలోని 9 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని వైసీపీనే కైవసం చేసుకుంది. టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.

ఇకే ఇంత భారీ ఓటమి తర్వాత జిల్లా నేతలు యాక్టివ్ గా లేరు. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూడా లేనట్లు అనిపిస్తోంది. అసలు జిల్లా పెద్దగా వ్యవహరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సైలెంట్ గా ఉన్నారు. ఈయన మొన్న ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన కుమార్తె అతిథి కూడా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. అటు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు కూడా అడ్రెస్ లేరు.

బొబ్బిలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈయన…అప్పుడప్పుడు మీడియా ముందు మాత్రమే కనిపిస్తున్నారు. అటు ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఇక సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి సైలెంట్ గా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీతా ,కోళ్ళ లలిత కుమారి. చిరంజీవులు, కిమిడి మృణాళిని, అప్పలనాయుడులు పార్టీలో యాక్టివ్ గా లేరు.  తాజాగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల “అన్నా క్యాంటిన్ల” మూసివేతకు నిరసనగా, ఇసుక విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తెలుగుదేశం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే! అయితే విజయనగరం జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులకు ఓ వినతిపత్రాన్ని మొక్కుబడిగా అందించి టీడీపీ నేతలు చేతులు దులుపుకున్నారట! ఈ జిల్లా నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన సుజయ్ కృష్ణరంగారావు ఒకటో అరో అధికారపక్షంపై విమర్శలు చేస్తున్నా ఆ ఎఫెక్ట్‌ పెద్దగా ప్రజల్లో కనిపించడం లేదు.

ఇక జిల్లా టీడీపీ నేతల్లో జవాబుదారీతనం పూర్తిగా కొరవడటం.. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలే తెలియని పరిస్థితిలో కార్యకర్తలు కొట్టుమిట్టాడటం వంటి కొన్ని అంశాలు ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా నష్టంచేశాయి. అవే సమస్యలు నేటికి కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి చంద్రబాబు ఇప్పటికైనా జిల్లాపై ఫోకస్ పెట్టి నేతలని  యాక్టివ్ చేస్తారో లేదో చూడాలి.

 

Leave a Reply