ఇంతకూ ఎవరికి లాభం!?

Vivekananda Reddy, murder, politics, TDP-YSRCP
Share Icons:

తిరుపతి, మార్చి 16,

మరో నెలరోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పాలక –ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలూ సిద్దం చేసుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇరు పార్టీలూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువ జామున వివేకానంద రెడ్డి హత్య జరిగింది.  ఉదయం 6-6.30 గంటల మధ్య మొదట ఈ విషయం పని మనుషుల ద్వారా బయటికి తెలిసింది. ఇక అప్పటి నుంచీ సౌమ్యుడుగా పేరున్న వివేకానంద రెడ్డి మరణం ఒక వైపు విచారం కలిగిస్తున్నా… ఆ మరణాన్ని ఆసరాచేసుకుని జరుగుతున్న తతంగం చూస్తున్నపుడు చాలా చికాకు కలుగుతోంది. మన రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయా అనిపిస్తోంది.

ఎన్నికల ముంగిట వివేకాను హత్య చేయడం ద్వారా ఎవరు లాభపడదామనుకున్నారు? ఆయన మృతితో ఏమి సమకూరుతుంది?  వివేకా తన స్వగృహంలో హత్యకు గురయ్యారు. సమీపంలోనా ఆ కుటుంబానికి కావలసిన వారు చాలా మంది ఉన్నారు. వారందరి ఇళ్ల వద్దా గట్టి రక్షణ వలయం ఉంటుంది కదా, ముఖ్యంగా ఈ ఎన్నికల వేళ.. మరి వివేకాను గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళ ఎవరు చంపి ఉంటారు. వారు ఎపుడు వచ్చారు? తిరిగి ఎలా వెల్లారు? ఎంతమంది పాల్గొన్నారు? మరి నిఘా వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి? ? అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి.

ఉదయం మాజీ పీయస్ కృష్ణారెడ్డి రావడంతో వివేకా ఇంటి వద్ద సందడి మొదలైంది. దాదాపు 5.30 నుంచి 6.30  వరకు గంటకు పైగా ఆయన అక్కడ వేచి ఉన్నారు.  తరువాత పనిమనుషులు వచ్చినపుడు(ఎందరో వివరణ లేదు) అందరూ  కలిసి వెనుకవైపు తెరచి ఉన్న దారి గుండా  లోనికి వెళ్లారు.  పడక గదిలో వివేకా లేరు.. ఏసీ పోతూనే ఉంది, గదిలో రక్తం… బాత్ రూంలో తీవ్రగాయాలతో.. రక్తపు మడుగులో వివేకా శవం. మరి దీనిని గుండె పోటుగా ఎందుకు భావించారు? పోలీసులకు ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారు?  రక్తాన్ని కడగడం, మృత దేహాన్ని బాత్ రూం నుంచి బెడ్ రూం కి, అక్కడ నుంచి ఆసుపత్రికి ఎవరి సలహాతో, ఎవరు తరలించారు? సాక్షాలను కడిగివేసేందుకు ఎందుకు ప్రయత్నించారు?  పడక గది గోడలపై 8 అడుగుల ఎత్తు వరకూ రక్తం మరకలు ఉంటే… గుండెపోటుతే మృతి అని చెప్పిన వారు ఎవరు? వారంత లేమెన్ లా…  ఇక్కడే పలు అనుమానాలు కలుగుతున్నాయి.

గాయాలు చూసినపుడు .. అంత తీవ్రంగా ఉంటే… ఉదయం గుండెపోటుతో మృతి అని ఎవరు ప్రకటించారు? మరీ ముఖ్యమైన విషయం హత్యకు వాడిన ఆయుధాలు ఎక్కడ? వివేకా రాసినట్టు చెబుతున్న లేఖ ఎక్కడ, ఎవరికి లభించింది? వారు వెంటనే దానిని పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? క్లూస్ టీం కు లేఖ ఎందుకు దొరకలేదు?చివరగా, మా చిన్నాన్నను గొడ్డలితో దారుణంగా చంపారని హత్యాయుధం గురించి జగన్ ఎలా పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముంది? హత్యారాజకీయాలు సభ్యసమాజం గర్హించవలసినవి. భౌతిక దాడులు రాక్షసులు చేసే పని. గుండెపోటుతో చనిపోయిన వివేకా మృత దేహానికి గాయాలు చేసి, దారుణ హత్యగా చిత్రీకరించి, లబ్ధి పొందాలనుకునే వారు కూడా ఉంటారా… !

మరి  నిరాడంబరంగా, సౌమ్యుడుగా పేరున్న వివేకానంద రెడ్డిని ఈ సమయంలో దారుణంగా హత్యచేయడానికి పాత కక్షలే కారణమా? కేవలం కుటుంబంలోని ఆర్థిక, రాజకీయ కారణాలతోనే ఆయన హత్యకు గురయ్యారా…. ? ప్రత్యర్థులు జగన్ ను బలహీనపరచడానికి వివేకాను బలితీసుకున్నారా… ఇంతకూ జరిగిందేమిటి? నిజం ఏమిటి? ఎవరు నిగ్గుతేల్చనున్నారు.. పోలీసులా.. సీబీఐ అధికారులా… ?

మామాట: చంపడమే సమస్యకు పరిష్కారం అనుకునే వారు మనుషులేనా…

Leave a Reply