వైసీపీ కంటే ముందే: విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్ధి ఫిక్స్…

Share Icons:

విశాఖపట్నం: కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఓ ఆరు వారాల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడిన ఎన్నికల కోడ్ మాత్రం కొనసాగుతుంది. అలాగే గెలుపుపై పార్టీలు వ్యూహాలు కూడా ముందుకెళుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం నగరం పరిధిలో తెలుగుదేశం పార్టీ దూకుడును కొనసాగిస్తోంది. విశాఖలో మొన్నటిదాకా వలసలను ఎదుర్కొన్నప్పటికీ.. తమ పార్టీలో నాయకత్వ లోటుకు, నాయకులకు కొరత లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే రెండడుగులు ముందే ఉంటోంది. ఆ పార్టీ కంటే ముందే మేయర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆయన పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పార్టీ సీనియర్ నాయకుడు గండి బాబ్జీని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. వలసలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నాయకుల పేర్లను వడబోసి మరీ.. గండి బాబ్జీ పేరును ఖరారు చేసింది. ఇదివరకు పీలా గోవింద్, గండి బాబ్జీ, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, తిప్పల గురుమూర్తి రెడ్డి పేర్లను పరిశీలించింది. వారిలో తిప్పల గురుమూర్తి రెడ్డి అనూహ్యంగా అధికార పార్టీ కండువాను కప్పుకొన్నారు. పల్లా శ్రీనివాస్ శాసనసభ స్థానంపై దృష్టి పెట్టడంతో ఆయన పేరుపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఇక పీలా గోవింద్, గండి బాబ్జీల పేర్లపై కొందరు పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించింది. మెజారిటీ నాయకులు గండి బాబ్జీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన పేరును ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో మేయర్ అభ్యర్థిగా గండి బాబ్జీ పేరును ప్రకటించిన తరువాతే ప్రచార కార్యక్రమాలను దిగబోతోంది. గండి బాబ్జీ శుక్రవారమే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు.

మేయర్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంతో ఆయన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. జీవీఎంసీ పరిధిలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు. దీనికోసం పార్టీలో నెలకొన్న విభేదాలను తొలగించడంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబులతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వినియోగించుకుంటున్నారు.

Leave a Reply