మొన్న ఎన్నికల్లో కావాలన్నారు…ఇప్పుడు మాకొద్దు అంటున్నారు…

AP BJP MLA VishnuKumar Raju sensation
Share Icons:

విశాఖపట్నం: ఏపీ బీజేపీ నేతలు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేడు విశాఖలో బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో ఏ విధంగా ముందుకుపోవాలనే దానిపై చర్చ చేసుకున్నారు. అనంతరం బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని అన్నారు. విశాఖ నగరంలోని 98 వార్డుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటున్న బీజేపీ నేతలు సీఎం జగన్ పాలన మీద విరుచుకుపడుతున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి డబ్బు ప్రలోభాలేమీ లేకుండా ఎన్నికల్లోకి వెళుతుందని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తులు జనసేన, బీజేపీలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ వైసీపీలో నేతలు అంతా అవినీతి నాయకులే అని పేర్కొన్నారు .మొన్న ఎన్నికల్లో కావాలి జగన్ రావాలి జగన్ అన్న ప్రజలు ఇప్పుడు మాకొద్దు జగన్ అంటున్నారని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించారు.

ఇక గత ఎన్నికల్లో వైసీపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి గెలిచిందని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ మాత్రం ప్రగతి సాధించలేదని పేర్కొన్నారు. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు. విచిత్రమైన ఆర్డినెన్స్ తెచ్చి పోటీదారులను భయపెడుతున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు విష్ణు కుమార్ రాజు . ప్రభుత్వం తెచ్చిన జీవోకి వేరే పార్టీలు భయపడతాయి తప్ప తాము కాదన్నారు.

ఇక విశాఖ మేయర్ స్థానమే తమ లక్ష్యం అన్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ రాజధాని పేరుతో రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో భూముల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ ఎప్పటి నుంచో ఆర్థిక రాజధానిగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్తాయని పేర్కొన్నారు. ఇక విశాఖ ప్రజలకు కావాల్సింది రాజధాని కాదని, ఉద్యోగ, ఉపాధి కల్పన కావాలని నీటి వసతి కావాలనిపేర్కొన్నారు.

ఇక ఏపీ సర్కార్ రాజధాని పేరుతో పబ్బం గడుపుకునే ఆలోచనకు స్వస్తిపలకాలని హితవు పలికారు. గతంలో అమరావతి పేరుతో జరిగిన ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ను తాము కూడా వ్యతిరేకించామని మాధవ్ గుర్తుచేశారు.

 

Leave a Reply