విరాటుడి వీర విహారం….సఫారీలపై టీమిండియా ఘనవిజయం

Virat Kohli masterclass gives India emphatic win over South Africa
Share Icons:

మొహాలీ: టీమిండియా విజయాల పరంపర కొనసాగుతుంది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో వరుసగా టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ లని కైవసం చేసుకున్న స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మొదలైన టీ20 సిరీస్ ని ఘనంగా ప్రారంభించింది. వర్షం కారణంగా మొదటి టీ20 రద్దయిన…మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది.  బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మూడు మ్యాచ్‌ ల సిరీస్‌లో కో హ్లీసేన 1-0తో ముందడుగు వేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(52 బంతుల్లో 72 నాటౌట్‌, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టుకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. హెండ్రిక్స్‌(6)ను దీపక్‌ చాహర్‌ ఔట్‌ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టానికి 39 పరుగులు చేసింది. డికాక్‌కు బవుమా జతకలిసిన తర్వాత స్కోరుబోర్డు ఊపందుకుంది. బవుమా..హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకుంటూ చెలరేగడంతో 10 ఓవర్లు ముగిసే సరికి సఫారీ స్కోరు 78కి చేరింది.

దీంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సైనీ విడగొట్టాడు. డికాక్‌..కోహ్లీ సూపర్‌ క్యాచ్‌తో ఔటయ్యాడు. డస్సెన్‌(1) జడేజాకు వికెట్‌ ఇచ్చుకోవడంతో జట్టు కష్టాల్లో పడింది. ఆఖరి నాలుగు ఓవర్లలో దక్షిణాఫ్రికా 24 పరుగులకే పరిమితమైంది. అయితే బవుమా(43 బంతుల్లో 49, 3ఫోర్లు, సిక్స్‌) రాణింపుతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 149/5 స్కోరు చేసింది.

ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఎక్కడ వెనుదిరగలేదు. రోహిత్‌శర్మ(12) రూపంలో మొదట వికెట్ కోల్పోయిన కోహ్లీ, ధావన్ లు దూకుడుగా ఆడారు.  ఇన్నింగ్స్‌ జోరందుకున్న తరుణంలో శంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన ధవన్‌.. బౌండరీ వద్ద మిల్లర్‌ సూపర్‌ క్యాచ్‌తో నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది.

ఫామ్‌లేమితో సతమతమవుతున్న పంత్‌(4) మరోమారు నిరాశపరిచాడు. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్..కోహ్లీతో కలిసి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో మ్యాచ్‌ బెంగళూరులో ఈనెల 22న జరుగుతుంది.

Leave a Reply