Virat Kohli: అనిల్ కుంబ్లేను సర్‌ప్రైజ్ చేసిన కోహ్లి.. షాకైన ఫ్యాన్స్

Share Icons:
టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్ జన్మదినం నేడు (అక్టోబర్ 17). కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్ కుంబ్లే నేడు 50వ ఏట అడుగుపెట్టాడు. టెస్టుల్లో పది వికెట్ల హాల్ సాధించడంతోపాటు.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరొందిన కుంబ్లేకు సోషల్ మీడియా ద్వారా క్రికెటర్లు, ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

టీమిండియా కెప్టెన్ సైతం మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకు బర్త్ డే విషెస్ చెప్పాడు. గతంలో కోహ్లి ఒత్తిడి కారణంగానే బీసీసీఐ అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. కానీ విబేధాలను పక్కనబెడుతూ.. ‘‘విష్ యూ హ్యపీ బర్త్ డే అనిల్ భాయ్’’ అని కోహ్లి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘థ్యాంక్స్ విరాట్’ అని కుంబ్లే బదులిచ్చాడు. కుంబ్లేను కోహ్లి విష్ చేయడంతో… క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. రకరకాల మీమ్స్‌తో కోహ్లి ట్వీట్‌కు బదులిస్తున్నారు. ఎవరైనా కోహ్లి ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారా..? అని కొందరు రిప్లయ్ ఇవ్వడం గమనార్హం.

2016లో రవిశాస్త్రి టీమిండియా కోచ్ అవుతాడని భావించినా.. అనూహ్యంగా కుంబ్లే నియమితుడయ్యాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో 17 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఓడింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు చేరినప్పటికీ కప్ గెలవలేకపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన 48 గంటల్లోపే కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేశాడు. మూడేళ్లపాటు కోచింగ్‌కు దూరంగా ఉన్న కుంబ్లే 2020 సీజన్లో పంజాబ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.