ఒకే కంపెనీలో 75 ఏళ్లు ఉద్యోగం చేసి 90 ఏళ్ల వయసులో రిటైర్‌మెంట్‌!!

Share Icons:

పదేళ్ల పాటు ఒకే కంపెనీలో పనిచేస్తేనే గొప్ప విషయంగా మారిన ఈ రోజుల్లో… ఓ వ్యక్తి మాత్రం, తను పనిచేస్తున్న కంపెనీలో అమృతోత్సవం జరుపుకున్నాడు. అసలు విషయం ఎంటంటే.. బ్రిటన్‌కు చెందిన బ్రియాన్‌ వెబ్‌ కుటుంబ పరిస్థితుల కారణంగా పదహారేళ్ల వయసులోనే సంపాదించాల్సిన పరిస్థితి. అతని అదృష్టం.. వెంటనే 1946లో వోక్స్‌ హాల్‌ అనే కార్ల కంపెనీలో మెకానిక్‌ ఉద్యోగం లభించింది.

నాలుగేళ్లలోనే మెకానిక్‌ నుంచి సీనియర్‌ మెకానిక్‌గా మారాడు. తర్వాత వివిధ పదోన్నతులు పొందుతూ వారంటీ అడ్మినిస్ట్రేటర్‌గా ఎదిగాడు. రోజులు గడిచేకొద్దీ.. సంస్థపై తనకున్న అభిమానం పెరిగిపోతూనే ఉంది. ఎంతలా అంటే.. తన 25 సంవత్సరాల సర్వీస్‌కు సంస్థ నుంచి అందిన వాచ్‌ను ఇప్పటికీ ధరించేంతలా! అయితే, ఎంత ఇష్టం ఉన్నా కాలాన్ని ఆపలేం కదా! పెరిగిపోతున్న వయసు ఆడ్డుకట్ట వేసింది. బ్రిటన్‌ రిటైర్మెంట్‌ రూల్స్‌ ప్రకారం పదవీ విరమణ పొందాడు.

దీంతో, 90 ఏళ్ల వయసులో 75 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకుని, రిటైర్‌మెంట్‌ తీసుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇందుకు సంస్థ నుంచి ఓ స్పానర్‌ను బహుమతిగా పొందాడు. ఇన్ని రోజులు విధినిర్వహణలో భాగమైన తన స్పానర్‌.. దానినే వారు మంచి బాక్స్‌లో పెట్టి, ఓ బంగారు పూత పూసిన ఫలకంపై అతని పేరు, సర్వీస్‌ వివరాలను ముద్రించి బహూకరించారు. వీటితో పాటు మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చారు.
‘చిన్నప్పటి నుంచి కార్లు అంటే ఇష్టం. అందుకే, ఇంతకాలం ఇంత ఇష్టంగా పనిచేయగలిగా! ఇంకొన్ని రోజులు పనిచేయమన్నా పనిచేస్తా. కంపెనీని, కొలీగ్స్‌ని బాగా మిస్‌ అవుతున్నా’ అంటూ బ్రియాన్‌ వెబ్‌ కంపెనీకి వీడ్కోలు పలికాడు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply