జనవరి1 నుంచి సచివాలయాల్లో అన్ని సేవలు: కొన్ని ఉచితం,కొన్నిటికి చార్జ్

village-secretariat-services-starts-january-1st
Share Icons:

అమరావతి: ఇప్పటివరకు అన్ని రకాల ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మీసేవ కేంద్రాలపై ఆధారపడిన విషయం తెలిసిందే. ఇక మీ సేవల్లో జనన, మరణ, కుల ధ్రవీకరణ పత్రాల కోసం, భూసంబంధిత పత్రాల కోసం మీ సేవలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉండేది. అయితే ప్రతి 5,000 జనాభాకు ఓ మీసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. కానీ ప్రస్తుతం ప్రతి 2,000 మంది జనాభాకు ఓ సచివాలయం ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని సేవలు ఉచితంగా, మరికొన్నిసేవలు కనీస ఛార్జీతో అందించనున్నారు.

ఇక జనవరి 1 నుంచి కొత్తగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,944 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో గ్రామాల్లో 11,158, పట్టణాల్లో 3,786 ఉన్నాయి. ఈ గ్రామ సచివాలయాల్లో మొత్తం 530 సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల ధ్రవీకరణ పత్రాలు, పన్నులు, రుసుముల చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. వివిధ పనుల కోసం ప్రజలు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. జనన, మరణ, కుల ధ్రవీకరణ పత్రాలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పత్రాలు పొందవచ్చు. ఇక, గ్రామ వాలంటీర్ల సాయంతో పెన్షన్లు, రేషన్ సరుకులు ఇస్తారు. ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కార్డులు, ఇళ్ల పట్టాలు, వైయస్సార్ పెళ్లి కానుక, వివిధ వర్గాలకు ప్రభుత్వం అందించే ఇతర ఆర్థిక సాయం కోసం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రామ సచివాలయాలకు మొత్తం 1,26,728 మంది ఉద్యోగులు అవసరం కాగా,  ఇప్పటి వరకు లక్షా పదివేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. మరో 16వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈ ఉద్యోగాలని జనవరిలో భర్తీ చేసే అవకాశముంది.

ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల అమలులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ఆయన, నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి రెడీ అయ్యారు. ఉగాది పర్వదినాన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకు ప్రభుత్వ భూములను కేటాయించడంతో పాటు ఇతర ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది.

 

Leave a Reply