చంద్రయాన్-2: విక్రమ్ మిస్సింగ్…లక్ష్యాన్ని వదిలేది లేదన్న మోడీ

vikram-lander-lost-signals-just-2-kilometers-away-from-moon
Share Icons:

బెంగళూరు:

దేశం గర్వించదగ్గ చంద్రయాన్- 2 లో లోపాలు తలెత్తాయి. ముందు నుంచి సాఫీగా సాగిన చంద్రయాన్-2 ఇంకా చంద్రుడుకు 2.1 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ప్పుడు విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌డం ఆగిపోయాయి. దీంతోనే ఇస్రోలో టెన్ష‌న్ నెల‌కొన్న‌ది. శాస్త్ర‌వేత్త‌లు ఇంకా డేటాను ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌ధాని మోదీతో పాటు ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌, మ‌రో ముగ్గురు మాజీ ఇస్రో చీఫ్‌లు కూడా ఆప‌రేష‌న్‌ను వీక్షించారు. అయితే విక్ర‌మ్‌కు ఏమైంద‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి.

అత్యంత క్లిష్ట‌మైన 15 నిమిషాల ప్ర‌క్రియ‌ను ల్యాండ‌ర్ దాదాపు పూర్తి చేసుకునే స‌మ‌యంలో విఘాతం ఎదురైంది. చంద్రుడి ఉప‌రిత‌లానికి 2.1 కిలోమీట‌ర్ల ఆల్టిట్యూడ్ వ‌ర‌కు విక్ర‌మ్ స‌జావుగా ప‌నిచేసింద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ తెలిపారు. కానీ ఆ త‌ర్వాతే ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్ మిస్సైన‌ట్లు ఆయ‌న చెప్పారు. డేటాను ప‌రిశీలిస్తున్నామ‌ని శివ‌న్ చెప్పారు.

ఇదిలా ఉంటే రాత్రి అంతా బెంగళూరు ఇస్రో కేంద్రంలో ఉండి ప్రధాని మోడీ ఈ ఆపరేషన్ ని వీక్షించారు. ఇక ల్యాండర్ మిస్ అయ్యాక మోడీ ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తలు భార‌త మాత విజ‌యం కోసం కృషి చేశారని, భార‌త్ కోసం పోరాటం చేశారని, భ‌ర‌త‌మాత త‌ల ఎత్తుకునేలా చేశారన్నారు. ఉన్న‌త స్థాయిలో పెట్టేందుకు కృషి చేశారు. మీరు జీవితాన్ని అంకితం చేశారు. నిన్న రాత్రి మీ మ‌న‌స్సును అర్థం చేసుకున్నాను. మీ క‌న్నులు ఎన్నో విష‌యాలు చెబుతాయి. నిరాశ‌లో మీరున్నారు. అందుకే నేను మీ మ‌ధ్య ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేక‌పోయాను.

మ‌ళ్లీ ఉద‌యం ఒక‌సారి మీతో మాట్లాడాల‌నుకున్నాను. మీరెన్నో రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గ‌డిపారు. ఈ మిష‌న్‌తో సంబంధం ఉన్న వ్య‌క్తులు భిన్న‌మైన‌వారు. అనుకోకుండా ఒకేసారి ఏమీ తెలియ‌కుండాపోతో ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఏం అయ్యింది, ఎలా అయ్యింది .. ఇలాంటి ప్ర‌శ్న‌లు సైంటిస్టుల‌ను వేధిస్తుంటాయి. మీరు అలాగే త‌ప‌న చెందారు. మ‌న‌కు ఇవాళ ఒక అవ‌రోధం ఎదురైంది.. కానీ ఏమాత్రం నీరుగారాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న ల‌క్ష్యం నుంచి దూరం కావాల్సిన అవ‌స‌రం లేదు. చంద్రుడిని చేరుకునే ల‌క్ష్యాన్ని వ‌దిలేది లేద‌న్నారు.

మంగ‌ళ గ్ర‌హంపై భార‌తీయ జెండాను నిలిపింది మీరేన‌ని మోదీ అన్నారు. చంద్ర‌యాన్ కూడా చంద్రుడిపై నీళ్లు ఉన్నాయ‌ని చెప్పింద‌న్నారు. మ‌నం వంద‌కు మించి శాటిలైట్ల‌ను ఒకేసారి ప్ర‌యోగించి రికార్డు సృష్టించామ‌న్నారు. ల‌క్ష్యాన్ని చేరుకునేవ‌ర‌కు నేర్చుకోవాలి, సాధించాల‌న్నారు. రానున్న మిష‌న్ల‌లో విజ‌యం సాధించాలంటూ శుభాకాంక్ష‌లు చెప్పారు. మీ నుంచి ప్రేర‌ణ పొందేందుకే మిమ్మిల్ని ఉద‌యం క‌లుసుకున్నాన‌న్నారు.

Leave a Reply